Wedding Tragedy in Ravikamatham : ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరి తీయనేలేదు. కాళ్లకు పెట్టిన పారాణి ఆరనే లేదు. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా ఇండ్లకు చేరనే లేదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మంగళవాయిద్యాల నడుమ ఒక్కటైన ఆ జంట విధి ఆడిన వింత నాటకంలో ఓడిపోయింది. మనసిచ్చి మనువాడిన వాడితో నూరేళ్లు సంతోషంగా జీవిద్దామనుకున్న నవ వధువు కలలు కల్లలయ్యాయి. జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమెను వదిలేసి మూడు రోజలకే అర్ధాంతరంగా వెళ్లిపోయాడు.
పెళ్లి సంబురం తీరక ముందే అతనికి నూరేళ్లు నిండాయి. స్నేహితులకు పెళ్లి పార్టీ ఇచ్చేందుకు వెళ్లిన వరుడు గ్రానైట్ క్వారీ గోతిలో ఈతకు దిగి ఆ నవ వరుడు మృత్యువాత పడ్డాడు. భర్త మరణ వార్తతో నవ వధువు శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మాటలకు అందని ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై రఘువర్మ, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రావికమతం మండలంలోని టి.అర్జాపురం శివారు పాత కొట్నాబిల్లికి చెందిన ఆసరి సీతారావు కుమారుడు జగదీష్ (26)కు అదే గ్రామానికి చెందిన యువతితో గురువారం నాడు రాత్రి గిరిజన సంప్రదాయబద్దంగా వివాహమైంది.
Groom Died in Ravikamatham : జగదీష్ శనివారం నాడు మధ్యాహ్నం ఐదుగురు స్నేహితులకు కొత్త కొట్నాబిల్లికి సమీపంలోని గ్రానైట్ క్వారీ వద్ద మ్యారేజ్ పార్టీ ఇచ్చాడు. స్నేహితులు మద్యం మత్తులో ఉండగా జగదీష్ దుస్తులతోపాటు పెళ్లి సమయంలో అత్తింటి వారు పెట్టిన బంగారం గొలుసు, ఉంగరాలు ఒడ్డున పెట్టి క్వారీ గోతిలో ఈతకు దిగాడు. మత్తు దిగాక స్నేహితులకు అతను కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడని భావించి వచ్చేశారు.
జగదీష్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు శనివారం రాత్రంతా గాలించారు. క్వారీ గోతిలో ఆదివారం నాడు మధ్యాహ్నం శవమై తేలాడు. ఈత కొట్టేందుకు గోతిలోకి దూకినప్పుడు బండరాయి తలకు బలంగా తగలడం, అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో మునిగి చనిపోయి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. తండ్రి సీతారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘువర్మ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషాదం - నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
ఇద్దరిని బలిగొన్న పందెం కోళ్లు - తండ్రీ కొడుకులను ముంచేసిన మృత్యువు