Wedding Season Start in summer 2025 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెళ్లిళ్ల సీజన్ రానే వచ్చేంది. ఇన్నాళ్లూ కల్యాణ ఘడియల కోసం వేచి చూస్తున్న యువతీ యువకులకు ఇక శుభవార్తని చెప్పవచ్చు. మండు వేసవిలో శుభ కార్యక్రమాలకు ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీంతో ఇక పెండ్లి బాజాలు మోగనున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎక్కువగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇందుకోసం ఫంక్షన్ హాల్స్ సిద్ధమయ్యాయి. పెళ్లి వధూవరులతోపాటు ఎన్నో కుటుంబాల్లో సంతోషాల్ని నింపడమే కాదు 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిస్తుంది.
మరోవైపు వివాహాలకు ఫంక్షన్ హళ్లను ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో వాటి ధరలను అమాంతగా పెంచేశారు. అదేవిధంగా పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, క్యాటరింగ్, వస్త్ర వ్యాపారులు, , అలంకరణ, రవాణా వాహన యజమానులు,బంగారం, వెండి వ్యాపారాలు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, టెంట్‌హౌస్‌లకు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ ఉంటుంది. ఒక్కో వివాహ శుభకార్యంలో సగటున ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మందికి పని దొరుకుతుంది. దాదాపు 3 నెలల పాటు వారు బిజీబిజీగా ఉండనున్నారు.
12న వేలాది పెళ్లిళ్లు : ఈ నెల 12న చైత్రమాస పూర్ణిమ, హస్తా నక్షత్రం శుభదాయకమైన ముహూర్తమని నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు. ఆ రోజు అధికంగా వివాహాలు ఉన్నాయని చెప్పారు. మే 10 నుంచి 28 వరకు కర్తెర ఉందని అన్నారు. ఈ సమయంలో శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు చేయరాదన్నారు. కానీ పెళ్లిళ్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 11 నుంచి జులై 12 వరకు గురు మూఢమి అయినందున ముహూర్తాలు, శుభ కార్యక్రమాలకు విరామం ఉంటుందని వివరించారు. శ్రావణ మాసం నుంచి శుభ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఈ ఏడాది వివాహాలు ఎక్కువగా జరుగుతాయని విశ్వావసు నామ సంవత్సరం అందరికీ శ్రేయోదాయకమని ఆయన వెల్లడించారు.
ఇవే తేదీలు :
- ఏప్రిల్ : 10, 11, 12, 13, 16, 20, 30
- మే : 1, 7, 8, 9, 10, 11, 14, 18, 23
- జూన్ : 4, 5, 6, 7, 8
పెళ్లి ఖర్చులకు వెనక్కి తగ్గని కుర్రకారు - సర్వేలో ఆసక్తికర విషయాలు
పెళ్లి ఫ్లెక్సీలు వేయిస్తున్నారా? - ఊహించని అతిథులతో ఇల్లు గుల్ల!