Weather Favour to Silk Crop Farmers in Sathya Sai District: వేసవిలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా బైవోల్టిన్ పట్టు పంట చేతికి రావటం కష్టం. ఈ ఏడాది ఎండ తీవ్రత కొద్దిరోజులకే పరిమితం కావటం, జూన్‌లో కురవాల్సిన వర్షాలు మే నెలలోనే రావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ప్రతికూల పరిస్థితిలో రైతుల చేతికి పట్టు పంటలు అందాయి.
ఆశాజనకంగా మార్కెట్లో ధరలు: ఇదే సమయంలో మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండటంతో కొంత గిట్టుబాటు లభించింది. వేసవిలో పంటలు చేతికి అందవని రైతులు మల్బరి ఆకును ఔషధ తయారీకి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు పంటలు చేతికి అందటం, మార్కెట్లో గూళ్ల ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు తిరిగి పట్టు పంట సాగుపై దృష్టి సారించారు.
పెరుగుతున్న పట్టుగూళ్ల రాబడి: శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం మార్కెట్‌కు పట్టుగూళ్ల రాబడి రోజురోజుకి పెరుగుతోంది. గత సోమవారం 5 టన్నులు, మంగళవారం 6, బుధవారం 4 టన్నుల బైవోల్టిన్ పట్టుగూళ్లు వచ్చాయి. ఈ గూళ్లు అత్యధికంగా కిలో రూ.706, అతి తక్కువగా రూ.366, సరాసరి రూ.550 ధరలు పలికాయి.
స్థానికంగానే అధిక ధరలు: గడచిన రోజుల్లో స్థానిక మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేవని మడకశిర తదితర ప్రాంతాలకు చెందిన రైతులు కర్ణాటక ప్రాంతం శిద్దలఘట్ట, రాంనగర్‌లకు పట్టుగూళ్లు తీసుకునివెళ్లి అక్కడ విక్రయించేవారు. ప్రస్తుతం స్థానికంగానే ధరలు అధికంగా ఉండటంతో రైతులు ఇక్కడికే పట్టు గూళ్లు తీసుకొస్తున్నారు. దీనివల్ల గూళ్లకు ఇతర పాంత్రాలకు వెళ్లుతున్న రీలర్లు స్థానికంగానే గూళ్లను కొనుగోలు చేస్తూ రీలింగ్ యూనిట్ల ద్వారా సిల్క్ తీస్తున్నారు.
వాతావరణ మార్పులు సహకరించాయి: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వాతావరణంలో ఏర్పడిన మార్పులు పట్టురైతులకు ఎంతో సహకరించాయని హిందూపురం పట్టుపరిశ్రమ సహాయ సంచాలకుడు సురేశ్ తెలిపారు. వేసవిలో రైతులు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా పంటలు చేతికి అందేవి కావని ప్రస్తుతం 100 గుడ్లకు 100 కిలోల గూళ్ల దిగుబడి వస్తోందని సురేష్ అన్నారు.