Vizianagaram Terror Plot Case Investigation: విజయనగరంలో టెర్రర్ లింక్స్ కేసు విచారణలో పోలీసులు జోరు పెంచారు. ఈ కేసులో అరెస్టైన సిరాజ్, సమీర్ కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇద్దరినీ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ జరుగుతోంది. ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసుల విచారణ ముమ్మరం చేశారు.
ఇద్దరికీ ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలిచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్‌కు మాడ్యుల్ అదేశాలిచ్చినట్లు సమాచారం. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై రిహార్సల్ చేసినట్లు గుర్తించారు. గత 6 నెలల్లో సిరాజ్ రెండు, మూడు సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్టు పోలీసుల చేతిలో ట్రావెల్ హిస్టరీ ఉంది. వీటన్నింటీపైనా నిర్ధారణకు సిరాజ్, సమీర్ని పోలీసులు కస్టడీకి కోరారు.
కేసులో సంచలన విషయాలు: విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. ఆరుగురు వ్యక్తులు ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ గ్రూపులో సిరాజ్, సమీర్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్రకి చెందిన యువకులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో 3 రోజులపాటు కలిసి ఉన్నారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలుపై చర్చించారు. వీరిలో ఇద్దరికి బాంబులు తయారుచేయాలని, మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
విజయనగరం చేరుకున్న ఎన్‌ఐఏ అధికారులు: ఈ కేసులో విజయనగరంలో సిరాజ్‌ను, హైదరాబాద్‌లో సమీర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. అమెజాన్‌లో పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని సిరాజ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఎన్‌ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. విజయనగరం టూటౌన్ స్టేషన్‌కు వెళ్లారు. కేసుకు సంబంధించిన విషయాలను టూటౌన్ పోలీసులను అడిగారు.
బాంబుపేలుళ్లకు కుట్ర: కాగా విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియా నుంచి గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రల కోసం వీరిద్దరికీ మార్గనిర్దేశం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో సంప్రదింపులు జరపగా, ఈ ఇద్దరు యువకులు దేశంలో పేలుళ్లకు ప్లాన్ చేశారు.
ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలంటూ సిరాజ్ విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ సమయంలోనే సిరాజ్, సమీర్ పలుమార్లు కలిశారు. అనంతరం సిరాజ్ విజయనగరం వచ్చి, పేలుళ్ల రిహార్సల్స్ కోసం ఆన్‌లైన్‌లో పేలుడు రసాయనాలను తెప్పించుకున్నట్లు గుర్తించారు. ఇప్పటికే సిరాజ్ ఇంటిపై దాడి చేసిన పోలీసులు, పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్‌లో సమీర్‌ను అదుపులోకి తీసుకుని విజయనగరం తీసుకొచ్చారు. నిందితులిద్దరికీ ఇప్పటికే విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఇప్పుడు సిరాజ్, సమీర్‌లను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
బాంబు పేలుళ్లకు విజయనగరంలో రిహార్సల్స్ - నిందితులకు 14 రోజుల రిమాండ్