Vizianagaram Terror Case Updates : ఉగ్రదాడుల కుట్ర కేసులో అరెస్టైన విజయనగరం వాసి సిరాజ్ ఆర్థిక లావాదేవీలపై పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు (ఎన్ఐఏ) గురిపెట్టారు. ఇప్పటికే ఒక ఖాతాలో రూ.42 లక్షల వరకూ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకేమైనా ఖాతాలున్నాయా? వాటిలో ఎంత మొత్తం నగదు ఉందనే వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్ సహా అతని కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అందించాలని వివిధ బ్యాంకులను దర్యాప్తు అధికారులు కోరారు.
విజయనగరం డీసీసీబీలో సిరాజ్ పేరిట పొదుపు, డిపాజిట్ ఖాతాలున్నాయి. నిందితుడి కుటుంబ సభ్యులు నలుగురికీ ఇదే బ్యాంకులో నాలుగు ఖాతాలు ఉన్నాయి. ఏఎస్సైగా పనిచేస్తున్న అతని తండ్రి పేరిట లాకర్ ఉన్నట్లు తెలిసింది. ఏడాది కిందటి వరకూ వారి కుటుంబమంతా కొత్తవలసలో నివాసం ఉండేది. ఆ తర్వాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయింది. కొత్తవలస డీసీసీబీ శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్ విజయనగరం శాఖకు మార్చుకున్నాడు.
Vizianagaram Terror Plot Case : సిరాజ్ ఖాతాను పరిశీలిస్తే నగదు జమ తప్ప విత్‌డ్రా చేసిన దాఖలాలు పెద్దగా లేవని తెలుస్తోంది. విడతల వారీగా రూ.70,000లు, రూ.80,000ల చొప్పున పలుమార్లు జమైనట్లు గుర్తించారు. జాతీయ బ్యాంకులెన్నో ఉన్నా డీసీసీబీలో ఖాతాలు కొనసాగించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ ఖాతాలో తండ్రే నగదు జమ చేశాడా ఇతరులెవరైనా వేశారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో సుమారు రూ.70 లక్షల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబ సభ్యుల కదలికలపై దర్యాప్తు అధికారులు నిఘా ఉంచారు. సిరాజ్ తండ్రి సోమవారం విజయనగరం డీసీసీబీకి వెళ్లారు. తన పేరిట ఉన్న లాకర్ తెరవాలని బ్యాంకు అధికారులను కోరారు. అప్పటికే పోలీసులు ఇచ్చిన ఆదేశాలతో లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని బ్యాంకు అధికారులు సిరాజ్ తండ్రికి చెప్పారు.
సోమవారం సాధారణ దుస్తుల్లో బ్యాంకుకు వెళ్లిన సిరాజ్ తండ్రి మంగళవారం ఖాకీ దుస్తుల్లో వెళ్లి సంప్రదించారు. అయినప్పటికీ లాకర్లు తెరవడం కుదరదని డీసీసీబీకి సిబ్బంది తేల్చిచెప్పడంతో కంగుతిని వెళ్లిపోయారు. సిరాజ్ రిమాండ్‌లో ఉండగా లాకర్ తెరవడానికి అతడి తండ్రి అంతగా ప్రయత్నిచండంతో అసలు అందులో ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. సిరాజ్‌ను స్థానిక కోర్టు కస్టడీకి అప్పగిస్తే బ్యాంకు ఖాతాల్లో నిధుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని పోలీసులు భావిస్తున్నారు.
విజయనగరానికి ఎన్ఐఏ టీమ్ - ఇద్దరినీ కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
విజయనగరంలో ఉగ్రమూలాల కేసు - ఆన్లైన్లో పేలుడు పదార్థాలు ఆర్డర్!