Visakhapatnam Sea Moss Too Costly : సముద్రపు నాచు (సీ వీడ్) పోషకాల నిధి. వీటి పెంపకంపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనూ క్షేత్రస్థాయిలో దీని ఉత్పత్తి, ప్రయోగాలు చేపడుతున్నారు. విశాఖ నగరంలోని ఆర్కేబీచ్ తీరం సమీపంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సముద్రపు నాచు సాగులో తొలి దిగుబడి వచ్చింది.
తమిళనాడు నుంచి విత్తనాలు తీసుకొచ్చి మొత్తం 50 యూనిట్ల ద్వారా థాన్ ఫౌండేషన్ మహిళల పర్యవేక్షణలో నాచు పెంపకం చేపట్టారు. సాగు చేయగా తొలి విడతగా రెండు టన్నుల దిగుబడి వచ్చిందని మత్స్యశాఖ జేడీ తెలుపుతున్నారు. ఇప్పుడు రెండో పంటకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సముద్రపు నాచు ధర కిలో రూ.21 వేల వరకు ఉందని, అయితే విశాఖలో పండించిన నాచుకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు తెలిపారు.
సముద్రపు నాచులో అధిక పోషకాలు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. దీనితో సీఐఎఫ్‌టీ (Central Institute of Fisheries Technology) ఆధ్వర్యంలో అనేక ఆహార పదార్థాలు తయారు చేసి, మార్కెట్‌కు తరలిస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. జపాన్, కొరియా దేశాల్లో దీని వినియోగంగా అధికంగా ఉంటుంది. ఔషధాల తయారీలోనూ నాచును వాడుతుంటారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సముద్రపు నాచు పంట వేశామని, విజయవంతమయితే తీర ప్రాంతం వెంబడి పెంపకం ప్రారంభిస్తామని జేడీ పి.లక్ష్మణరావు పేర్కొన్నారు.
సముద్రపు నాచు అని తీసిపారేయకండి - వీటిని సాగు చేస్తే లాభాలు బాగు!
సముద్రపు నాచును ఆహారం, ఔషధాలు సహా సౌందర్య ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో ఈ సాగుకు విస్తృత అవకాశాలుండటంలో ఇప్పటికే సాగు విస్తృతం చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. గతంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వీటి పెంపకానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి తమిళనాడు రాష్ట్రం మండపంలోని మెరైన్ ఆల్గల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ లక్కాకుల ఇక్కడి తీర ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. సముద్ర నాచు పెంపకం చేపట్టే వారే సొంతంగా వాటి నుంచి విలువైన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
చెరువుల్లో నాచును పండిస్తున్న గోదావరి వాసులు - ఉపాధితో పాటు చక్కని ఆదాయం