Building Collapsed in Godavarikhani : పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్లను ఆక్రమించి ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవాళ గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో ఓ భవంతిని కూల్చివేస్తున్న సమయంలో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో బిల్డింగ్ ముందు భాగాన్ని జేసీబీతో కూలుస్తున్నారు. ఈ సమయంలోనే అకస్మాత్తుగా భవనం మొత్తం కుప్పకూలింది.
భవనం పెద్ద శబ్ధంతో కుప్పకూలడంతో పెద్ద ఎత్తున దుమ్ము గాల్లోకి లేచింది. దీంతో అక్కడున్న మున్సిపల్ సిబ్బంది, స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనం శిథిలాలు పడటంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అయితే పోలీసులు ముందుగానే రోడ్డుపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఎలాంటి సమస్య రాలేదు.
డ్రైవర్ గాయాలు : భవనం ఒక్కసారిగా కూలడంతో జేసీబీపై భవనం శిథిలాలు పడ్డాయి. ఈ ఘటనలో జేసీబీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాగా పాత భవనం కావడం, పిల్లర్లు శిథిలావస్థకు చేరడంతో భవనం ఒక్కసారిగా కూలిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
పల్లెటూరులో 250 ఏళ్ల రాజభవనం- 9 కుటుంబాలతో ఎప్పుడూ కళకళగా!
కుంగిన సీతారామ ప్రాజెక్టు పిల్లర్ - 10 రోజులు గడిచినా బయటకు రానివ్వని అధికారులు