Villagers Facing Unemployment Problem Due to Merging Villages into Cities : రోజురోజుకు నగరాలు, పట్టణాలు విస్తరిస్తున్నాయి. అభివృద్ధిలో భాగంగా అధికారులు సమీపంలోని పల్లెలను ఆయా నగరాల్లో విలీనం చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు గ్రామీణులకు ఆర్థికంగా భరోసానిచ్చిన ఉపాధి హామీ పథకం దూరమవుతోంది. ఉపాధి పనులకు వెళ్లలేక ప్రత్నామ్నాయం దొరక్క వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనమైన కొన్ని పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.
ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం, తోటపాలెం గ్రామాలను కొంత కాలం కిందట శ్రీకాకుళం నగరంలో విలీనం చేశారు. మౌలిక సదుపాయాల్లేకపోవడంతో పాటు కనీసం చేసేందుకు పనీ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు గ్రామాలను తిరిగి ఎచ్చెర్ల మండలంలో కలపాలని ఇటీవల శాసనసభలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సైతం ప్రస్తావించారు. 2020లో ఈ రెండింటితో పాటు శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని పాత్రునివలస, పెద్దపాడు, కాజీపేట, కిల్లిపాలెం, చాపుర గ్రామాలను నగరంలో కలిపారు. నాటి నుంచి ఏడు చోట్ల ఉపాధి పనులు నిలిపేశారు. దీంతో ఏడు గ్రామాల్లో కలిపి సుమారుగా 15 వేల మంది ఉపాధికి దూరమయ్యారు. వీరంతా అయిదేళ్ల నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వినతి పత్రాలిచ్చిన ఉపయోగం లేదు: వైఎస్సార్సీపీ హయాంలో ఈ సమస్యను ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లోనే మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను ఈ విషయమై పలువురు మహిళలు గ్రామంలోనే నిలదీశారు. కలెక్టర్ ఫిర్యాదుల విభాగంలోనూ వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేదని అసహనం చెందుతున్నారు. 100 రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాల్లో విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రోత్సాహకాలతో పాటు, యువతకు ప్రత్యేకంగా ఇచ్చే ఉద్యోగ శిక్షణలకు సైతం నోచుకోలేకపోతున్నామని పలువురు పేర్కొంటున్నారు.
ఎవరూ పట్టించుకోలేదు: తమ గ్రామం శ్రీకాకుళంలో విలీనం కావటంలో ఐదేళ్ల నుంచి ఉపాధి హామీ పనుల్లేవని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో ఎంతో మంది వేరే పని దొరక్క ఎక్కడికీ వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ సమస్యపై ఎన్ని సార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు సమస్య విన్నవించినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సమస్య తెలియజేశాం: నగరంలో విలీనమైన గ్రామాల్లో ప్రజలు వారి సమస్యను తెలియజేశారని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు తెలిపారు. ఆ మేరకు ప్రత్యామ్నాయ పనులు కల్పించాలని ఉన్నతాధికారులకు సమస్య తెలియజేశామన్నారు.
స్మార్ట్‌గా అమరావతి పరిధిలోని గ్రామాలు - మారుతున్న రూపురేఖలు
ఎన్నికల అయిపోయాక మీ ఊరు మాది కాదు అంటారు- అల్లూరి జిల్లాలో ఓ గ్రామం దీనస్థితి