Vijayawada Railway Station Developed With Rs 850 Crores : వచ్చే మూడు దశాబ్దాల్లో పెరగనున్న ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్ పచ్చజెండా ఊపింది. రైల్వేస్టేషన్ తాజాగా కేటగిరి-1లో చేరడంతో రూ.850 కోట్లతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు 1.14 లక్షలు, రద్దీ వేళల్లో గంటకు 9,120 మంది ప్రయాణికులు ఈ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 2061 నాటికి రోజుకు 2 లక్షలకు చేరుతారనేది అంచనా.
దానికి తగ్గట్టుగా రద్దీ సమయాల్లో ఒకేసారి 20 వేల మంది ప్రయాణికులు వచ్చి వెళ్లేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుతం ప్రధాన మార్గం వైపు మాత్రమే అభివృద్ధి అంతా సాగుతుండగా కొత్త రైల్వేస్టేషన్‌లో పశ్చిమం వైపు కూడా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
- ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ 1 జాబితాలో చేరిన విజయవాడ రైల్వేస్టేషన్ 12,538 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దానిని 1.54 లక్షల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. దీనిలో స్టేషన్ 84 వేల చదరపు మీటర్లు, హోటళ్లు సహా వాణిజ్య సముదాయాలు 70 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్నాయి.
- పార్కింగ్ ప్రాంతం ప్రస్తుతం 426 కార్లు పట్టే సామర్థ్యంతో ఉండగా అది 1,700 కార్లకు పెరగనుంది.
- లిఫ్ట్‌లు 08 ఉండగా వాటిని 35కు, ఎస్కలేటర్లు 9 ఉండగా వాటిని 30కి పెంచనున్నారు.
- ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను విస్తరించనున్నారు.
- ప్లాట్ ఫాంల సంఖ్య 10 నుంచి 12కు పెరగనుంది.
ఎస్కలేటర్లు, అధునాతన సదుపాయాలు - ఎయిర్పోర్ట్ తరహాలో విజయవాడ రైల్వేస్టేషన్
నిత్యం లక్ష మందికి పైగా : దక్షిణ మధ్య రైల్వేలోనే కీలకమైన స్టేషన్ విజయవాడ. నిత్యం లక్ష మంది, పండగలు, సెలవు రోజుల్లో 2లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 10 ప్లాట్‌ఫాంలున్న స్టేషన్ నుంచి నిత్యం 250కి పైగా ప్రయాణికుల రైళ్లు, 80 గూడ్సు బండ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన రైల్వేజంక్షన్ కావడంతో ఆదాయంలోనూ అగ్రస్థానంలో ఉంటోంది. చారిత్రక, వారసత్వ సంపద కలిగిన స్టేషన్‌గా, ఐదు ప్రవేశ ద్వారాలతో విజయవాడ అరుదైన గుర్తింపు పొందింది. ఏడాదికి వచ్చే ఆదాయం రూ.500 కోట్లు దాటడంతో గతేడాది బెజవాడ రైల్వేస్టేషన్ ఎన్‌ఎస్‌జీ 1 హోదా సాధించిన సంగతి తెలిసిందే.
విజయవాడ రైల్వేస్టేషన్‌కు అరుదైన ఘనత - ఎన్‌ఎస్‌జీ1గా గుర్తింపు - NSG 1 designation for Vijayawada