ETV Bharat / state

కోరుకొన్న చోటకే కొరియర్​లో మత్తు - కళాశాలలకు డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠా అరెస్టు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: డీసీపీ సరిత - 33 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

Drugs Gang Arrested In Vijayawada
Drugs Gang Arrested In Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 6, 2025 at 10:18 AM IST

2 Min Read
Choose ETV Bharat

Drugs Gang Arrested In Vijayawada: దిల్లీ నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించి గుట్టుగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. డ్రగ్స్‌ తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి, వారిని బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేసి, 33 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.వివరాలను డీసీపీ సరిత, సెంట్రల్‌ ఏసీపీ దామోదర్‌ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కళాశాలలకు డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠా అరెస్టు (ETV Bharat)

ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మనోహర్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతని మేనమామ ఉత్తరప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటాడు. కొన్నేళ్ల క్రితం అక్కడికెళ్లి పనిచేసిన మనోహర్‌కు దిల్లీకి చెందిన రింకు పరిచమై అతని దగ్గర డ్రగ్‌ తీసుకుని ఉపయోగించాడు. యూపీ నుంచి వచ్చిన తర్వాత చిన్ననాటి స్నేహితుడు జీవన్​తో కలిసి డ్రగ్స్‌ తీసుకునే వాడు. ఆ తర్వాత మనోహర్‌ దిల్లీ నుంచి కొరియర్‌ ద్వారా జీవన్‌కు డ్రగ్స్​ పంపించేవాడు. అనంతరం వచ్చిన క్యూఆర్‌ కోడ్‌కు నగదు పంపేవాడు.

భారీగా విస్తరించిన నెట్​వర్క్​: ఇలా తెప్పించిన మాదకద్రవ్యాన్ని జీవన్‌ పెనమలూరుకు చెందిన సమద్, పటమట టీచర్స్‌ కాలనీకి చెందిన బొంతు నితీశ్ కుమార్‌ అలియాస్‌ బబ్బు, యనమలకుదురుకు చెందిన తూలిమెల్లి తరుణ్‌ ప్రసాద్‌ల సహాయంతో నగరంలోని విద్యార్థులకు అమ్మేవారు. నితీశ్ జాబ్‌ కన్సల్టెన్సీలో పని చేస్తుండగా తరుణ్‌ నగర శివారులోని ఓ కళాశాలలో తరుణ్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, పటమట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి జీవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారంతో నితీశ్, తరుణ్‌లను అదుపులోకి తీసుకుని 33 గ్రాముల ఎండీఎం, 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వాట్సాప్‌ ద్వారా సంభాషణలు: ఈ ముఠాతో ఎవరెవరు టచ్‌లో ఉన్నారు? ఏయే వర్గాలకు విక్రయాలు సాగిస్తున్నారు? తదితర వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరు సాధారణ కాల్స్‌లో కాకుండా వాట్సాప్‌ ద్వారా సంభాషణలు, కాల్స్‌ చేసుకునే వారని రుజువైంది. వాట్సాప్‌ ఛాట్‌ డేటాను తిరిగి రికవరీ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ వివరాలన్నీ వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

''వాహన తనిఖీ చేస్తుండగా కొంతమంది ఎండీఎంఏ డ్రగ్​ను తీసుకెళుతున్నట్లు తెలిసింది. అందులో ముగ్గురు వ్యక్తులను తిరుమలశెట్టి జీవన్​కుమార్, నితీశ్​ కుమార్, ప్రసాద్ లు ఎండీఎం డ్రగ్స్​ ప్యాకెట్​లను సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకుని 33 గ్రాముల ఎండీఎం, 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. మీ విలువైన జీవితాలను డ్రగ్స్ బారిన పడి నాశనం చేసుకోవద్దు''-సరిత,విజయవాడ డీసీపీ

ఇంటర్​నెట్​లో చూసి ఇంట్లోనే డ్రగ్స్ తయారీ - ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

మట్టి గాజుల్లో మాదక ద్రవ్యాలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు