Vigilance Searches at Telangana State Archives : తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అక్రమ కార్యకలాపాలను నిగ్గు తేల్చడంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దృష్టి సారించింది. విచారణ కోసం అదనపు ఎస్పీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించింది. రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో ఉద్యోగులను రాత్రి పొద్దుపోయే వరకు సిట్ అధికారుల బృందం విచారణ చేపట్టింది.
ఈనాడు, ఈటీవీ భారత్, ఈటీవీలో కథనం : హైదరాబాద్ ఆర్కైవ్స్‌లోని విలువైన దస్త్రాలు బయటికి తీసుకురావడం, ఆ స్థానంలో నకిలీ పత్రాలను చొప్పించడంతో పాటు అవే అసలైనవంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తూ భూ ఆక్రమణలకు, న్యాయ వివాదాలకు కొందరు కారణమవుతున్న వైనంపై ‘ఆర్కైవ్స్‌లో దొంగలు పడ్డారు!’ శీర్షికన ఈ నెల 4న ఈనాడు, ఈటీవీ భారత్, ఈటీవీలో వచ్చిన కథనం కలకలం సృష్టించింది. హైదరాబాద్ శివార్లలోని విలువైన భూములను కొల్లగొట్టేందుకు కొన్ని ముఠాలు పన్నిన పన్నాగాలను ఆధార సహితంగా కథనంలో ప్రస్తావించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం, గురువారం రంగంలోకి దిగింది. ఆర్కైవ్స్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని మూసివేసి పలువురు అధికారులు, సిబ్బంది వాంగ్మూలాలను సేకరించింది.
పురాతన కాలం నాటి భూదస్త్రాలకు నిలయమైన ఆర్కైవ్స్ విభాగంలో నకిలీ దస్త్రాల దందాపై విజిలెన్స్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. ఆ విభాగంలోని సిబ్బంది సహకారంతో భూకబ్జాదారులు నకిలీ రికార్డులు సృష్టించిన అంశంపై కూపీ లాగుతోంది. ఇప్పటికే రాయదుర్గంలో 83 ఎకరాలు, మంచిరేవులలో 76 ఎకరాలు, యాచారంలో 10 ఎకరాల భూములకు సంబంధించి నకిలీ దస్త్రాలు సృష్టించినట్లు బహిర్గతం కావడంతో ఆయా రికార్డులను సేకరించడంలో నిమగ్నమైంది. నకిలీ దస్త్రాలు సృష్టించడంలో కీలకపాత్ర పోషించింది ఎవరు? వాటిని ఆర్కైవ్స్‌లోని సంబంధిత విభాగంలోకి ఎవరు చేర్చారు? దీని వెనక సూత్రధారులు ఎవరు? పాత్రధారులెవరు? ముఠాలకు సహకరించిన ఇంటిదొంగలు ఎందరున్నారు? తదితర వివరాలను సేకరించే దిశగా విజిలెన్స్ బృందం విచారణ కొనసాగిస్తోంది. అధికారులు అడిగిన వివరాలన్నీ సమర్పించామని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు.
నకిలీ దస్త్రాలపై ఇప్పటికే సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, నార్సింగి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసుల తాలూకు వివరాలు ఇవ్వాలని కోరుతూ సంబంధిత ఠాణాలకు విజిలెన్స్ లేఖలు రాసింది.
రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో అక్రమాలపై ఈటీవీ భారత్ కథనం - విజిలెన్స్ అధికారుల సోదాలు
వందల ఏళ్ల నాటి ఏ భూదస్త్రం కావాలన్నా అక్కడ దొరుకుతుంది - కానీ ఇంటి దొంగలే పడ్డారు!