Vehicle Scrapping in Telangana : హైదరాబాద్ నగరంలో ప్రజల అవసరాలు పెరుగుతున్న కొద్దీ వాహనాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో సిటీలో కాలుష్యం కూడా కోరలు చాస్తోంది. దీనికి కాలం చెల్లిన వాహనాలే ముఖ్య కారణం. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో జనవరి నాటికి మొత్తం 84 లక్షల వాహనాలు ఉన్నాయి. వాటిలో కాలం చెల్లినవి 24.40 లక్షలు. వీటిని తుక్కు చేసే ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు వాహనదారుకు ధ్రువపత్రం : ఇటీవల జీడిమెట్ల సమీపంలోని పాశమైలారంలో ఓ ప్లాంటుకు అనుమతి కూడా ఇచ్చింది. వ్యక్తిగత అవసరాలకు తీసుకున్న వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీ నుంచి 15 సంవత్సరాలు, వాణిజ్య కోసం ఉపయోగించేవి ఎనిమిది సంవత్సరాలు దాటితే కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. వీటిపై హరిత పన్ను వసూలు చేస్తారు. అయితే తుక్కుగా మార్చుకుని అదే విభాగానికి చెందిన వాహనాన్ని కొనుగోలు చేస్తే జీవితకాల పన్నులో కొంత మొత్తం రాయితీగా పొందవచ్చు. రవాణా ఇన్‌స్పెక్టర్లు పరిశీలించి వాహనం పనికిరాదని తేల్చితే తుక్కుకు పంపాలి. రవాణా శాఖ ఆఫీస్లో దరఖాస్తు చేయాలి. ఒరిజినల్ ఆర్సీని జత చేయాలి. ప్రక్రియ పూర్తి అయ్యాక రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు వాహనదారుకు ధ్రువపత్రం ఇస్తారు.
తుక్కు చేసుకున్న ధ్రువపత్రంతో వాహనాలు కొనుగోలు : రవాణా కార్యాలయం అధికారుల నుంచి పొందిన ధ్రువపత్రంతో ఆ శాఖ నుంచి అనుమతి పొందిన తుక్కు కేంద్రానికి వాహనాన్ని తీసుకెళ్లాలి. వారు ఆ వివరాలను పరిశీలించి ప్రక్రియ ప్రారంభిస్తారు. అనంతరం స్క్రాప్ చేసిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సంబంధిత వ్యక్తికి తుక్కు కేంద్రం, నంబరు, వాహన రకం, తేదీ వివరాలతో నిర్ధారణ పత్రం ఇస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి వాణిజ్య అయితే రెండు సంవత్సరాలు, వ్యక్తిగత అయితే సంవత్సర కాలపరిమితిలో రాయితీ లభిస్తుంది. తుక్కు చేసుకున్న ధ్రువపత్రంతో వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు.
వ్యక్తిగత అవసరాల వాహనాలు తుక్కుగా మార్చుకుంటే రాయితీలు ఇలా : -
వాహనం ధర (రూ.లక్షల్లో) | రాయితీ (రూ.ల్లో) |
ద్విచక్ర వాహనాలు | |
లక్ష లోపు | 1,000 |
1-2 | 2,000 |
2-3 | 3,000 |
3-4 | 4,000 |
4-5 | 5,000 |
నాలుగు చక్రాల వాహనాలు | |
5 లక్షలలోపు | 10,000 |
5-10 | 20,000 |
10-15 | 30,000 |
15-20 | 40,000 |
20 లక్షలకు పైన | 50,000 |
కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చుకోవాలా? - మీకోసమే ఈ ప్లాంట్లు