VANA MAHOTSAVAM IN AP : పర్యావరణం. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది. మనిషి మనుగడను చిన్నాభిన్నం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, వడగాల్పులు సహా ప్రకృతి విపత్తులుతో పాటు మరెన్నో వాతావరణ సమస్యలకు పర్యావరణమే కారణం. మరి అలాంటి పర్యావరణం పరిరక్షణకు మొక్కల పెంపకమే పరిష్కారం. అందుకే అదే కార్యక్రమానికి మరోసారి భారీగా తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 5 నుంచి ఆగస్టు చివరి వరకు వనమహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. కోటి మొక్కల పెంపకమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది సర్కారు. అటవీ ప్రాంతాలు సహా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఖాళీ ప్రదేశాలతో పాటు రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటనున్నారు. పచ్చదనం పెంపు సహా పౌరులకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మానవ జాతికి ఎంతో మేలు: వృక్షో రక్షతి రక్షతి రక్షితహా. అనేక వాతావరణ మార్పులకు చెట్ల నరికివేతే కారణం. పర్యావరణ పరిరక్షణకు కూడా చెట్లే కీలకం. జాతి మనుగడకూ చెట్లే ఆధారం. అంతటి ప్రాముఖ్యత కలిగిన చెట్లను వీలైతే 4 పెంచాలి కానీ, ఇష్టారీతిన నరికేస్తున్న వారు ఎందరో. తద్వారా నాణ్యమైన గాలి అందని ద్రాక్షగా మారింది. పర్యావరణం దెబ్బతింటోంది. అనేక వాతావరణ మార్పులు చవిచూడాల్సి వస్తుంది. ఆస్తి, ప్రాణ నష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారమే లేదా? ఈ పరిస్థితులను మార్చలేమా అంటే ఎందుకు లేదు, అదే మొక్కల పెంపకం. మొక్కలు సరైన రీతిలో నాటి వాటిని సంరక్షిస్తే పర్యావరణానికి, మానవ జాతికి ఎంతో మేలు జరగనుంది. అందుకే మొక్కలు పెంచాలని, పర్యావరణాన్ని సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
తొలిరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు: ఏటా వర్షాకాలం మొదలై. తొలకరి జల్లులు నేలను తాకగానే మొక్కలు నాటేందుకు సిద్ధం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది కూడా ఆగస్టులో వనమహోత్సవాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం, ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో జూన్ 5 నుంచి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచపర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రారంభయ్యే మొక్కల పెంపు పండుగ, ఆగస్టు చివరి వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా కోట్లాది మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని మొదలు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగనుంది. సీఎం చంద్రబాబు సహా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులంతా విధిగా మొక్కలు నాటుతారు. ఐతే తొలిరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యం.
మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు, ప్లాస్టిక్ కాలుష్య నివారణ కార్యక్రమాలు చేపడుతుంది. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ప్లాస్టిక్ కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
మొక్కల నాటే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్ల ముందు నుంచే సన్నద్ధం అవుతుంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు అందుబాటులో ఉండేలా నర్సరీలు ఏర్పాటు చేసింది. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సిద్ధం చేసింది. రకరకాల మొక్కలు నాటాలని భావించిన సర్కారు, అందుకు అనువైన ప్రాంతాల్లోనే నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంచించి. ఉదాహరణకు ఏలూరు జిల్లాలో 8 నర్సరీలు ఏర్పాటు చేసి 4.50 లక్షల మొక్కలను సిద్ధం చేశారు.
ఉంగుటూరు, నామవరం, ఫాతిమాపురం, బత్తులవారిగూడెం, జంగారెడ్డిగూడెం, తడికలపూడి, మర్లగూడెం, దానవారిగూడెం నర్సరీల్లో నీడనిచ్చే మొక్కలతోపాటు పండ్ల, పూలమొక్కలు ఉన్నాయి. వీటిని బుధవారం సాయంత్రానికి ఆయా కార్యాలయాలు, విద్యా సంస్థలకు చేర్చాలని సూచించారు. కాగా జూన్ 5న మొదలై ఆగస్టు వరకు జరిగే వనమహోత్సవంలో వాటన్నింటినీ నాటేందుకు ఏలూరు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మండలానికి 15 వేల చొప్పున ఆయా రకాల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఉపాధిహామీ పనులకు హాజరయ్యే కార్మికులతో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటిస్తారు. విద్యా సంస్థల్లో వాటి నిర్వాహకులే చర్యలు తీసుకుంటారు. సామాజిక వన విభాగం నర్సరీల నుంచి ఆయా మొక్కలను ఉచితంగా అందజేస్తారు. ప్రస్తుతం జిల్లాలో సామాజిక నర్సరీల్లో 18.60 లక్షలు మొక్కలు ఉన్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో నాణ్యమైన గాలి, అటవీ విస్తీర్ణం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం ఏటా కొనసాగుతుంది. 2024లోనూ కొనసాగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గుంటూరులో మొక్కలు నాటారు. రాష్ట్రంలో 50 శాతం అటవీ విస్తీర్ణమే లక్ష్యం అని తెలిపారు. అందుకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు మొదలైన నేపథ్యంలో వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
మొక్కలు నాటమే కాదు, వాటి సంరక్షణకు పూర్తి బాధ్యత తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీ సిబ్బందితో వాటి రక్షణకు చర్యలు తీసుకుంటుంది. నిజానికి మానవజాతి అన్ని దశల్లోనూ మొక్కలు ఆదుకుంటున్నాయి. అనాది నుంచీ ఆధారంగా నిలుస్తూ వస్తున్నాయి. మనం శ్వాస ద్వారా పీల్చే గాలిలోని ఆక్సిజన్ మొక్కలు, చెట్ల నుంచే లభిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. తినే తిండి, ధరించే దుస్తులు, వేసుకునే మందులన్నీ వీటి పుణ్యమే. ప్రతి 10 మందుల్లో 9 మందులు మొక్కల నుంచే సంగ్రహిస్తుండటం గమనార్హం. చిన్నాచితకా సమస్యలకే కాదు, తీవ్ర జబ్బుల మందులు సైతం వీటి నుంచి లభిస్తున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రజలు సైతం పాల్గొంటే మరింత విజయవంతం అవుతుంది. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటితే, కోట్లాది మొక్కలు నాటినవాళ్లం అవుతాం. అంతేనా వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే రాష్ట్రంలో పర్యావరణం మెరుగుపడుతుంది. నాణ్యమైన గాలి మనకు అందుతుంది. అటవీ విస్తీరాన్ని పెంచాలనే లక్ష్యం నెరవేరుతుంది.
లక్ష మొక్కలు నాటిన ఒడిశా ట్రీ మ్యాన్ - కూలీ చేస్తూ పూరి గుడిసెలో జీవనం!
ఒక్క మొక్క ఖరీదే రూ.12లక్షలు- ఎడారి గులాబీ సాగుతో లక్షల్లో ఆదాయం