US WARSHIPS AT VISAKHAPATNAM: ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతకు దిక్సూచిగా భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘టైగర్ ట్రయాంఫ్-2025’ (TIGER TRIUMPH 2025) విన్యాసాల్లో భాగంగా అమెరికా యుద్ధ నౌకలు విశాఖ తీరానికి వచ్చాయి. ఈ నెల 7వ తేదీ వరకూ హార్బర్ ఫేజ్ విన్యాసాలు ఉంటాయి. అమెరికా యుద్ధ నౌకల సందర్శనకు శుక్రవారం వివిధ రంగాల ప్రతినిధులకు అనుమతించారు. విశాఖ పోర్టు వద్ద అమెరికాకి చెందిన యూఎస్‌ఎస్-కంస్టాక్, యూఎస్‌ఎస్ రాల్ఫ్ జాన్సన్ -144 నౌకల ప్రత్యేకతలను కమాండర్లు బైరాన్‌స్టాక్స్, జాక్ సీజర్ వివరించారు.
ఈ నౌకల ఏ విధంగా పని చేస్తాయి, గతంలో అందించిన సేవల గురించి తెలిపారు. ఆయా నౌకల్లో నేవిగేషన్, రాడార్ వ్యవస్థ, కెప్టెన్ ఛాంబర్, క్యాంటీన్, గదులు, యుద్ధ విభాగాలపై సమగ్రంగా యూఎస్ అధికారులు వివరించారు. మరో వైపు ఈఎన్‌సీలో భారత్-అమెరికా దేశాల ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు.
యూఎస్‌ఎస్-కంస్టాక్ నౌక యుద్ధ సమయంలోనే కాకుండా విపత్తుల సమయంలో ఎలా సహాయ కార్యక్రమాలు చేపడుతుందో వివరించారు. ఈ నౌకలో భారీ హోవర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ హెలికాప్టర్ల నిర్వహణ ఎలా ఉంటుందో తెలిపారు. అత్యాధునిక ఆయుధాలను వినియోగించి శత్రువులను ఏ విధంగా ఎదుర్కొంటారో ఓ ప్రదర్శన ద్వారా చూపించారు. సుదూర లక్ష్యాల మీద దాడి చేసే లాంచర్లు గురించి కూడా వివరించారు. అమెరికా నౌకాదళంలో యూఎస్‌ఎస్ రాల్ఫ్ జాన్సన్-144కు విధ్వంసకర యుద్ధ నౌకగా పేరుంది. సముద్రం, వాయుమార్గం, భూభాగంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల క్షిపణులను కలిగి ఉండటం దీని ప్రత్యేకతగా పేర్కొన్నారు.
అమెరికా యుద్ధ నౌకలు ఇవే:
నౌక 1: యూఎస్‌ఎస్-కంస్టాక్
పొడవు: 186 మీటర్లు
ఎత్తు: 54 మీటర్లు
బరువు: 16,485.47 టన్నులు
ప్రారంభం: 1990 ఫిబ్రవరి 3
సిబ్బంది: 400
దీని ప్రత్యేకత :
- యుద్ధాల్లో పాల్గొనడమే కాకుండా తుపాన్లు వంటి విపత్తుల్లో తగిన సహకారం అందిస్తుంది. యుద్ధ హెలికాప్టర్, ట్యాంకర్లను రవాణా చేస్తుంది. నౌకలో బాంబులతో కూడిన పలు భారీ ట్రక్కులుంటాయి.
- ఇందులో ఒక ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అందులో ఎక్స్రే , స్కానింగు యూనిట్లున్నాయి. దంత చికిత్సలు ఇక్కడే చేస్తారు.
నౌక 2: రాల్ఫ్ జాన్సన్
పొడవు: 155.6 మీటర్లు
బరువు: 9,400
ప్రారంభం: 2015 డిసెంబరు
సిబ్బంది: 300
అధికారులు: 45
ఉండే క్షిపణులు: 96
దీని ప్రత్యేకత : క్షిపణి దాడులను తిప్పి కొట్టే సత్తాగల నౌకగా దీనికి పేరుంది. దూర ప్రాంత లక్ష్యాలను ఛేదిస్తుంది. లాంచర్లను నిర్వహిస్తుంది.
యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ- దేశ చరిత్రలో ఇదే తొలిసారి!
37 ఏళ్లుగా సముద్రంలో పహారా - రణ్విజయ్ ఎందుకంత స్పెషల్ అంటే?