Union Minister Kirti Vardhan Singh Inaugurated Regional Passport Office : విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమ, గద్దె రామ్మోహన్‌లతో కలిసి ప్రారంభించారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. నేడు ఉద్యోగ, వ్యాపారం పరంగా అనేక అవకాశాలు వచ్చాయని, మోడీ సారధ్యంలో ఎకనామిక్ గ్రోత్ పెరిగిందని వ్యాఖ్యానించారు.
దేశంలోనే చాలా రాష్ట్రాల్లో అనేక అవకాశాలు ఉన్నాయన్న మంత్రి, హార్డ్ వర్క్ చేసే వారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో మనమే అందరికీ అండగా నిలిచామని ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసిందంటే ప్రధాని మోడీనే కారణమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ పరంగా దేశం అభివృద్ధి చెందిందని తెలిపారు. మోడీ నాయకత్వాన్ని, ఆయన పని తీరును ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని అన్నారు. మనం అమలు చేస్తున్న టెక్నాలజీని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకున్నా ప్రపంచంలో మన దేశం గ్లోబల్ ఎకానమీ పరంగా మూడొ స్థానంలో నిలిచామని వెల్లడించారు.
ఏపీకి మరో ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం.. ఎక్కడంటే..?
గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు వృద్ది రేటులో ముందంజలో ఉన్నాయని కేంద్ర మంత్రి వర్థన్ సింగ్ తెలిపారు. గుంటూరు టూ జర్మనీ, నెల్లూరు టూ న్యూయార్క్ వరకు ప్రపంచం మొత్తం మన వాళ్లు ఉన్నారని వెల్లడించారు. రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయంలోనే ప్రింటింగ్, ఇతర అన్ని రకాల సేవలు ఇక్కడ నుంచే అందిస్తారని స్పష్టం చేశారు. రోజుకు ఐదు వందల దరఖాస్తులు నుంచి వెయ్యి దరఖాస్తులకు పెరిగాయని తెలిపారు. పాస్ పోర్ట్‌లను సకాలంలో బట్వాడా చేస్తున్న పోస్టల్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేక సెంట్రల్ కార్యాలయం నిర్మాణం కోసం రెండు ఎకరాలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మోడీ ముందు చూపు, సంస్కరణల అమలు కారణంగా భారత్ అభివృద్ధి దిశగా పయనిస్తుందని వెల్లడించారు. 2047 వికసిత్ భారత్‌లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. విజయవాడలో ఏర్పాటు అయిన రీజనల్ పాస్ పోర్ట్ కేంద్రం నుంచి ప్రజలు మరిన్నిసేవలు పొందాలని కోరుతున్నానని అన్నారు.
విదేశాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇక ఆ సర్టిఫికెట్ అప్లై ఆన్‌లైన్‌లోనే!
విజయవాడలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని తెలిపారు. కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పాస్ పోర్ట్ కార్యాలయం ఆధునీకరించారని విశాఖతో పాటు ఇప్పుడు విజయవాడలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ద్వారా అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆరువందల నుంచి రెండు వేల మంది నేడు దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్‌లో భాగంగా ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అమరావతిలో కూడా ఒక పాస్ పోర్ట్ కార్యాలయం నిర్మాణం జరుగుతుందన్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ కీలక కార్యాలయం రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సుష్మా స్వరాజ్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతుందని యువత విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సేవలు అందుబాటులోకి తెచ్చారని వ్యాఖ్యానించారు. మొబైల్ యాప్ ద్వారా కూడా సేవలను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం పై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అర్జెంట్‌గా విదేశాలకు వెళ్లాలా? 'తత్కాల్ పాస్‌పోర్ట్' కోసం అప్లై చేసుకోండిలా!