Unknown Person Entered in DK Aruna Home : బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 56లో డీకే అరుణ నివాసం ఉంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడడ్డాడు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో తిరిగినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది.
తెల్లవారు జామున 3గంటలకు ఇంట్లో శబ్దం వచ్చిందని కానీ, ఎవరూ కనిపించలేదని డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం కిచెన్‌లో పాదముద్రలు ఉండటంతో సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఓ వ్యక్తి వంటగది వైపు కిటికీలో నుంచి వచ్చినట్టు కనిపించింది. మాస్క్, గ్లౌజులు వేసుకొని వచ్చాడని గుర్తించారు.
ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు. మీటింగ్ కోసం నిన్న మహబూబ్‌నగర్ వెళ్లారు. ఆగంతకుడు గంటన్నర పాటు కిచెన్‌లో ఉన్నాడు. ఎంపీ గది వరకు వెళ్లాడు. ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు. నిందితుడు గతంలో అదే ఇంట్లో వంటమనిషిగా పనిచేసిన అమిత్‌గా అనుమానిస్తున్నారు. అమిత్ బిహార్ వాసి. కొన్ని నెలల క్రితం అతడిని పనిలో నుంచి తీసివేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
"3గంటలకు శబ్ధం వచ్చింది. ఎవరూ కనిపించ లేదు. పొద్దున చూస్తే పాదముద్రలు కనిపించాయి. సీసీ ఫుటేజ్ చూస్తే ఎవరో వచ్చినట్లు కనిపించింది. అతను గంటన్నర సేపు ఇంట్లోనే ఉన్నా ఏం తీసుకెళ్లలేదు. అతను ఎందుకు వచ్చాడో తెలియడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు" - లక్ష్మణ్, డీకే అరుణ డ్రైవర్
జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీకే అరుణ తెలిపారు. తనకు, తన కుటుంబానికి ప్రభుత్వం భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో తన కుటుంబంపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని, అన్ని అంశాలు పరిశీలించి తమ కుటుంబానికి భద్రత పెంచాలని ఆమె కోరారు. మరోవైపు ఈ ఘటనపై అరుణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి ఆరా తీశారు. పోలీస్ ఉన్నతాధికారులకు బండి సంజయ్ ఫోన్ చేసి డీకే అరుణకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో ఉన్నది కొడంగల్ వాసులే : డీకే అరుణ
'జమిలి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపాలి : డీకే అరుణ