Two Children Died In A Car Ranganreddy District : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. కారు డోర్లు లాక్ అవడంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. చేవెళ్ల మండలం పామన గ్రామానికి చెందిన వెంకటేష్ జ్యోతి దంపతుల కూతురు తన్మయ శ్రీ (5), షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కూతురు అభినయశ్రీ (4) మరణించడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ నెల 30న తమ మేనమామ పెళ్లి ఉండడంతో అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన పిల్లలు ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది.
అప్పటికే మృతి : ఆ చిన్నారులు ఆడుకోవడానికి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లారు. అయితే, కారు డోర్లు లాక్ పడటం, అది ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక చిన్నారులు ప్రాణాలు విడిచారు. చిన్నారులు ఎంతసేపటికీ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం చుట్టుపక్కల వెతికారు. చివరకు కారులో అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను చూసి వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు : చిన్నారులు మృతి చెందారనే విషయం తెలిసి తల్లిదండ్రులు బోరున విలపించడంతో అక్కడున్న వారందరూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డోర్లు ఎలా లాక్ అయ్యాయి? ఇతరత్రా కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.