Tumburu Theertham Attracting Toursits: పచ్చని ఒడిలో శిలా సౌందర్యంతో కట్టిపడేసే తుంబురు క్షేత్రం భక్తులకు, పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. తిరుమల శ్రీవారి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. శుక్ర, శనివారం తిరుమలలో తుంబురతీర్థ ముక్కోటి జరగనుంది. ముక్కోటికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
శేషాచలం గిరులు జంతుకోటికి ఆలవాలమే కాకుండా జలసంపదకు నిలయాలుగా ఉన్నాయి. తిరుమల గిరుల్లో ఏకంగా 3.50 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నట్లు బ్రహ్మ, స్కంధపురాణాలు పేర్కొంటున్నాయి. ఈ తీర్థాల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం.
తుంబురతీర్థ ముక్కోటి: శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం శుక్ర, శనివారాల్లో ఘనంగా జరగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తుంబురతీర్థ ముక్కోటికి ఉదయం 5 నుంచి 10 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు. తిరుమల నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో చేరుకుని, అక్కడి నుంచి కొండప్రాంతంలో నడవాల్సి ఉంటుంది.
పాపవినాశనం నుంచి భక్తులను అటవీశాఖ అనుమతిస్తోంది. ఈ మేరకు తిరుమల-పాపవినాశనం మార్గంలో ప్రైవేటు వాహనాలకు టీటీడీ అనుమతి నిలిపివేసింది. వృద్ధులు, గుండె, శ్వాస సంబంధిత సమస్యలున్న వారికి అనుమతి లేదు. భక్తులు వంటసామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని అధికారులు సూచించారు. పాపవినాశనం జలాశయం వద్ద అన్నప్రసాదాలు, నీరు, మజ్జిగ సరఫరా చేస్తారు. దారిపొడవునా ఉండి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
గంధర్వుడి నామంతో ప్రాశస్త్యం: సౌరమాసమైన మీనమాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రయుక్తమైన పౌర్ణమినాడు ముక్కోటి దేవతలు తుంబుర తీర్థంలో పవిత్రస్నానం చేస్తారని, ఈ రోజున స్నానం చేస్తే విశేష పుణ్యప్రదం, పునర్జన్మరాహిత్యం కలుగుతుందని వరాహపురాణం చెబుతోంది. పూర్వం ఓ గంధర్వుడు భార్యతో కలిసి ఈ ప్రాంతంలో నివసించేవాడని, మాఘమాసంలో ప్రతిరోజూ స్నానమాచరించి మోక్షానికి అర్హత సాధించేందుకు సంకల్పించాడు. అయితే భార్య సహకరించకపోవడంతో కోపంతో మండూకమై చెట్టు బొరియలో నివసించేలా ఆమెను శపిస్తాడు.
భార్య క్షమించమని వేడుకోగా ఆగస్త్య మహాముని తన శిష్యులతో వచ్చి ఈ తీర్థ మహాత్మ్యాన్ని వివరిస్తారని, అది విన్న తరువాతే మళ్లీ గంధర్వరూపం వస్తుందని ఆయన శాప విమోచనం చెబుతారు. అప్పటి నుంచి తుంబురు తీర్థంగా గంధర్వనామంతో ప్రసిద్ధి చెందినట్లు చెబుతున్నారు. తుంబురుడిపై మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. 19వ శతాబ్దం మొదటి భాగంలో తరిగొండ వెంగమాంబ ఈ ప్రాంతంలోనే శ్రీవేంకటేశ్వర ధ్యానం చేశారు.
టీటీడీ కీలక నిర్ణయం - భక్తుల కోసం అలిపిరిలో బేస్ క్యాంప్!
తిరుమలలో ఏప్రిల్లో విశేష పర్వదినాలు ఇవే! - 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం