NRIs for Voluntary Services in TTD : తిరుమల తిరుపతి దేవస్థానంలో మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు అమలు చేయనున్నట్లు టీటీడీ ఈఓ జె.శ్యామలరావు పేర్కొన్నారు. శనివారం నాడు స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ డయల్ యువర్ ఈఓ కార్యక్రమం జరిగింది. ఇందులో అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి ఈఓ పలు అభివృద్ధి ప్రణాళికలు వివరించారు. ఎన్నారైలూ శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా గోమాత సేవ చేసేందుకు కొత్తగా గో సేవను అందుబాటులోకి తీసుకురానున్నామని శ్యామలరావు వివరించారు.
తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళిక విభాగం ఏర్పాటు చేశామని శ్యామలరావు తెలిపారు. మొదటి దశలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతిలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేసేందుకు చర్యలుచేపట్టామని ఈఓ వెల్లడించారు.
Technological Reforms in TTD : శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం 14 దేశాలకు చెందిన ఎన్నారైలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. వైద్యం, ఐటీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో సేవలందించేందుకు ఎన్నారైలు ముందుకు వస్తున్నారని చెప్పారు. వారి సేవలను వినియోగించుకునేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఈఓ ఆదేశాలిచ్చారు.
తిరుమలలోని కల్యాణ వేదికలో ఓ ముస్లిం వ్యక్తి నమాజు చేసిన ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడైనట్లు శ్యామలరావు వెల్లడించారు. కొందరి ప్రోద్బలంతోనే సదరు వ్యక్తి కల్యాణ వేదికలో నమాజు చేసినట్లు తేలిందని చెప్పారు దేవాదాయశాఖ చట్టం ప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటున్నట్లు శ్యామలరావు స్పష్టం చేశారు.
Devotees Rush in Tirumala : మరోవైపు తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం నాడు శ్రీనివాసుడిని 90,211 మంది భక్తులు దర్శించుకోగా 43,346 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు వచ్చింది.
తిరుమలలో క్యూలైన్ షెడ్లు - భక్తులకు ఉపశమనం
టీటీడీ కీలక నిర్ణయాలు- తిరుమల కొండపై పచ్చదనం పెంచేందుకు రూ.4 కోట్లు