TTD Key Decision For SVBC Channel: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి విశిష్టత, సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఉద్దేశించిన ఎస్వీబీసీ (శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్) కొద్ది సంవత్సరాలుగా మూగబోయింది. వైఎస్సార్సీపీ హయాంలో వివాదాస్పద అంశాలకు వేదికగా నిలిచి ఇప్పటికీ కోలుకోలేదు. ఎస్వీబీసీ ప్రక్షాళనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో నిపుణుల కమిటీతో ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో కెమెరాల వినియోగం, కెమెరామెన్ల వివరాలలో వ్యత్యాసం, నైపుణ్యత కలిగిన టెక్నీషియన్లు లేకపోవడం, స్క్రిప్ట్ రైటర్లు, నిర్మాతలు, కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షించే సరైన యంత్రాంగం లేరనే అంశాన్ని నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. పాత డాక్యుమెంటరీలనే మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తున్నట్లు గుర్తించారు.
నిర్మాతలు మాయం: గతంలో ఎస్వీబీసీ ఛానల్‌లో వందమందికి పైగా నిర్మాతలు ఉండేవారు. ఇప్పుడు పట్టుమని పదిమంది లేరు. హెచ్‌డీలోకి మారాలని అనుకున్నా అదీ జరగలేదు. కోట్లు ఖర్చుపెట్టినా నాణ్యమైన ప్రసారాలు రావడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో తీసిన పలు డాక్యుమెంటరీలు ఎక్కడున్నాయో అంతుపట్టడం లేదు.
కీలక హోదాలు ఖాళీ: చీఫ్ ప్రోగ్రామింగ్ అధికారి, సీఈఓ, ఈపీఓ వంటి కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల దూరదర్శన్ నుంచి ఉద్యోగ విరమణ పొందిన అధికారిణిని ఓఎస్‌డీగా తెచ్చారు. ఆమె ఇక్కడి వర్గపోరు భరించలేక త్వరలో తప్పుకోనున్నట్లు తెలిసింది. ఎస్వీబీసీ ఛానల్‌లో గత 12 ఏళ్లుగా జరిగిన అనేక కొనుగోళ్ల అంశాలపై విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలైనట్లు తెలుస్తోంది.
పూర్వవైభవం తీసుకురావాలి: ఎస్‌వీబీసీకి ప్రత్యేకంగా విరాళాలు వస్తున్నాయి. టీటీడీ అడగకపోయినా ప్రకటనలు ఇచ్చేవారు ఉన్నారు. ఛానల్ కోసం స్వచ్ఛందంగా పనిచేసే దాతలు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా వారి సేవలను సద్వినియోగం చేసుకుని ఛానల్‌కు మెరుగులు దిద్దాలని భక్తులు కోరుతున్నారు.
ఎస్వీబీసీ ఉద్యోగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి: భాను ప్రకాశ్ రెడ్డి
SVBC kannada channel: 'ఎస్వీబీసీ కన్నడ ఛానల్‌కు సహాయ సహకారాలు అందిస్తాం'