Tirumala Latest News : యువతలో ఆధ్యాత్మికం పెంచడానికి, అలాగే సనాతన ధర్మంపై ఆసక్తిని కల్పించడానికి టీటీడీ కొత్త ఆలోచన చేసింది. రామకోటి తరహాలో గోవింద కోటిని ఎవరైతే రాస్తారో వారికి, వారి కుటుంబసభ్యులకు వీఐపీ దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితమే ప్రవేశపెట్టినా, ఇప్పటివరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. ఇలా గోవింద కోటి రాసేవాళ్లకు కొన్ని నియమ నిబంధనలను టీటీడీ పెట్టింది. ఎలా రాయాలి? ఆ పుస్తకాలు ఎక్కడ తీసుకోవాలో చెప్పింది.
25 ఏళ్లు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఈ గోవింద కోటి రాసేందుకు అర్హులు. వారు 10,01,115 సార్లు గోవింద కోటి రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులందరికీ వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. ఈ పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ దొరకవు. కేవలం టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్లైన్లోనే గోవింద కోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకం ఒక్కోటి 200 పేజీలు ఉంటాయి. ఇందులో 39,600 నామాలు రాసుకోవచ్చు.
26 పుస్తకాలు అవసరం : ఇలా 10,01,116 గోవిందకోటి నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరం అవుతాయి. కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. ఈ గోవిందకోటి నామాలను రాయడం పూర్తి చేసిన వారు వాటిని తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో అందిస్తే, వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని పేష్కార్ రామకృష్ణ తెలిపారు. ఈ గోవిందకోటి నామాల పుస్తకాన్ని మొదటిగా పూర్తి చేసింది కర్ణాటక విద్యార్థిని.

మొదటి దర్శనం కర్ణాటక విద్యార్థిని : మొదటిసారిగా గోవిందకోటి నామాల పుస్తకాన్ని కర్ణాటకకు చెందిన కీర్తన గతేడాది ఏప్రిల్లో పూర్తి చేశారు. బెంగళూరులో ఇంటర్ పూర్తి చేసిన ఆమె 10,01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీకి సమర్పించారు. ఆ యువతికి టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. అనంతరం మరో ఇద్దరు గోవింద కోటి నామాలు రాస్తే, వారికి కూడా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
వీఐపీ సిఫారసు లేఖలతో తిరుమల వెళ్తున్నారా? - అయితే ఈ న్యూస్ మీ కోసమే
సెలవులకు ముందే తిరుమల వెళ్లేవారికి - IRCTC సూపర్ ప్యాకేజీ - శ్రీకాళహస్తి కూడా!