TTD EO SYAMALARAO COMMENTS: గత వైఎస్సార్సీపీ పాలనలో 2021-24 మధ్య టీటీడీ గోశాలలో అనేక అవకతవకలు జరిగాయని, వీటిపై విజిలెన్స్ నివేదికలు కూడా ఉన్నాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ ఈవో మీడియా సమావేశంలో మాట్లాడారు.
జూన్ 2024లో ఈవోగా బాధ్యతలు తీసుకునే ముందు సీఎంను కలిశానని చెప్పారు. ఆ సమయంలో టీటీడీలో వ్యవస్థలు పాడయ్యాయని, వాటిని సరిచేయాలని సీఎం చెప్పారన్నారు. పది నెలల్లో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరిచామని తెలిపారు. టీటీడీ ఐటీ విభాగంలో ఉన్నతస్థాయి అధికారి నియామకంలో నిబంధన గాలికొదిలేశారని, జీఎం స్థాయి అధికారి నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఐటీ విభాగం వైఫల్యంతో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక దళారి 50 సార్లు ఆర్జిత సేవలు టికెట్ పొందారని పేర్కొన్నారు.
ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో అక్రమాలు: ఆవు నెయ్యి కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందని టీటీడీ ఈవో తెలిపారు. ప్రస్తుతం కల్తీ నెయ్యి సరఫరా అరికట్టామని వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని, స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో పలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. రూ.3 కోట్ల విలువైన సరకులకు రూ.25 కోట్లు చెల్లించారని, టీటీడీ గోశాల నిర్వహణలో ఎన్నో అక్రమాలు జరిగాయని అన్నారు. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు గోశాలలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూడు నెలల్లో 43 ఆవులు చనిపోయాయి: ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని, 2023లో విజిలెన్స్ అధికారులను గోశాలకు అనుమతించలేదన్నారు. గోశాలలో అక్రమాలు బయటపెడతారని భయంతో విజిలెన్స్ అధికారులను రానివ్వలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నారు. మూడు నెలల్లో వంద ఆవులు చనిపోయాయని తెలిపారని, అసత్యాలు ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారని అన్నారు. సగటున నెలకు 15 ఆవులు చనిపోతాయని, గడిచిన మూడు నెలల్లో 43 ఆవులు చనిపోయాయని వెల్లడించారు. దాతల నుంచి తీసుకున్న ఆవుల్లో కొన్ని అనారోగ్యంతో చనిపోయాయని, మృతి చెందిన ఆవులకు పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో గోవులు తాగే నీళ్లు కూడా నాచు పట్టేసినా పట్టించుకోలేదని తెలిపారు. పురుగులు పట్టేసి, వినియోగించుకోలేని నీళ్లు గోవులకు పట్టిస్తారా? అని ప్రశ్నించారు. విజిలెన్స్ వాళ్లు వెళ్లేందుకు కూడా గతంలో అనుమతించని పరిస్థితి ఉండేదని, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంపై చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని మండిపడ్డారు. గోశాల ఆవరణలో చెల్లాచెదురుగా మెడిసిన్స్ పడేశారని అన్నారు. ప్రస్తుతం గతంలో జరిగిన తప్పులన్నింటిని ప్రక్షాళన చేశామని పేర్కొన్నారు.
దళారులను నియంత్రించాం: తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులను నియంత్రించామని, దళారులపై పోలీసు, విజిలెన్స్ విభాగం నుంచి చర్యలు తీసుకున్నామన్నారు. ఆవు నెయ్యి కల్తీ విషయం అందరికీ తెలిసిందేనని, ఏఆర్ డెయిరీని బ్లాక్‌లిస్టులో పెట్టామని చెప్పారు. సిట్ విచారణలో ఎవరి నుంచి ఎవరికి నెయ్యి సరఫరా అయిందో వివరాలు సేకరిస్తున్నారని, రూ.320కే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా అని ఆలోచించాలి కదా? అని ప్రశ్నించారు. క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ పెట్టుకోవాలి కదా? అని మండిపడ్డారు. మన వద్ద లేకపోతే ఎక్కడికైనా వెళ్లి నాణ్యతా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదాలు చేస్తున్నామని, ప్రస్తుతానికి నందిని నెయ్యి వాడుతున్నామని వెల్లడించారు.
టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దు - గోవు, గోవిందుడితో భూమన ఆటలా?