ETV Bharat / state

గిరిజన మహిళల అక్రమ రవాణా - ఉలిక్కిపడ్డ ఆసిఫాబాద్​ గడ్డ

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో మహిళల అక్రమ రవాణా - యువతులను మధ్యప్రదేశ్​కు తరలించిన ముఠా సభ్యులు - 9 మంది నిందితులను గుర్తించిన పోలీసులు

Telangana Human Trafficking Case
Telangana Human Trafficking Case (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : June 19, 2025 at 12:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

Telangana Human Trafficking Case : మహిళల అక్రమ రవాణాతో కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి మహిళలను అక్రమ రవాణా చేస్తున్న విషయం బయటకు పొక్కడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. అమాయకులైన యువతులను మభ్యపెట్టి, మధ్యప్రదేశ్​కు అమ్మిన సంఘటన బాధితుల ఫిర్యాదుతో బయటకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డీఎస్పీ రామానుజన్​, స్థానిక సీఐ రవీందర్​ తెలిపిన వివరాల ప్రకారం, ఆసిఫాబాద్​ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతి ఏడాది క్రితం తప్పిపోగా, ఆమె తండ్రి అప్పటి నుంచి కుమార్తె కోసం గాలిస్తున్నాడు. అయితే ఓ కానిస్టేబుల్​ ఆ యువతిని రూ.1.30 లక్షలకు మధ్యప్రదేశ్​కు చెందిన వారికి విక్రయించాడు. అదే వ్యక్తి ఇటీవల యువతి ఆధార్​ కార్డుపై తన మొబైల్​ నంబర్​ నమోదు చేయించాడు. అయితే కార్డు నేరుగా బాధితురాలి ఇంటికి పోస్టులో వచ్చింది. కార్డులో ఉన్న ఫోన్​ నంబర్​కు డయల్​ చేయగా, అది మధ్యప్రదేశ్​కు చెందినదిగా తెలిసింది. ఈ విషయంపై యువతి తండ్రి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో మరో మహిళ మధ్యప్రదేశ్​లోని వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారంతా నేరం అంగీకరించారు. ఇందుకు సంబంధించిన తొమ్మిది మంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ ముఠా సభ్యులు మొదటి యువతిని రూ.1.30 లక్షలకు అమ్మి వేయగా, రెండో యువతిని రూ.1.10 లక్షలకు అమ్మేసినట్లు విచారణలో తేలింది. 9 మంది నిందితుల్లో ఐదుగురు మహిళలు కాగా, నలుగురు పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఏ1 గా మంచిర్యాలలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పరికిపండ్ల విజయలక్ష్మి, ఏ-2గా జిల్లా కేంద్రంలోని టీఆర్​ నగర్​కు చెందిన సత్యంశెట్టి సుజాత, ఏ-3గా రాజంపేటకు చెందిన పంచపుల, ఏ-4గా వాంకిడి మండలం బెండరకు చెందిన తాడూరి ఉష, ఏ-5గా సస్పెండ్​ అయిన కానిస్టేబుల్​ హరిదాస్​, ఏ-6గా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన దుర్గం సుధాకర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పరారీలో ముగ్గురు నిందితులు : మధ్యప్రదేశ్​లోని జావ్రాకు చెందిన ఏ7 రమేశ్​ గౌడ్​, ఏ8 సురేఖ, ఏ9 జగదీశ్​ పరారీలో ఉన్నట్లు వివరించారు. పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్​ వెళ్లినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి ఒక ద్విచక్ర వాహనం, సెల్​ఫోన్​తో పాటు రూ.50 వేలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వీరిలో హరిదాస్​, సురేఖ పదేపదే ఇటువంటి కేసులలో నిందితులుగా ఉన్నారు. బాధితులు ఇద్దరూ ఎస్టీలు కావడంతో ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు మానవ అక్రమ రవాణా, లైంగిక నేరం, అనైతిక నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఒంటరి మహిళలు, పెళ్లికాని వారు, భర్త చనిపోయిన వారినే లక్ష్యంగా చేసుకొని ఇటువంటి ముఠాలు పని చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి వారు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

తెలంగాణ ఆడపడుచులను ఆటపట్టించడం అంత ఈజీ కాదు!

శివాలయంలో సంచలన లేఖ-100మంది భారతీయుల అక్రమ రవాణా! పాక్, దుబాయ్​కు అమ్మకం!!