Lack of Facilities For Tourists in Tatipudi Eco Tourism : పచ్చని కొండలు చూడాలంటే అరకు వెళ్లాలి. బోటు ఎక్కాలంటే బీచ్‌కు వెళ్లాలి. ఆ రెండు కలిసే చోటుకి కావాలంటే విజయనగరం జిల్లా తాటిపూడి రావాల్సిందే. కనుచూపు మేరలో కనిపించే గోస్తనీ నది, చల్లని గాలిలో బోటు షికారు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. కానీ విహారం కోసం వస్తున్న వారిని అసౌకర్యాలు నిత్యం వేధిస్తున్నాయి. ఇక్కడ ఉన్న గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ బోటు షికారును 2018లో నిలిపేశారు. మరలా ఆరేళ్ల విరామం తర్వాత 2025 జనవరి 3న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. దీంతో పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే వేచి ఉండే గది, ఫుడ్ కార్నర్, తాగునీరు సదుపాయం, మరుగుదొడ్లు తదితరాలు లేవు. దీంతో చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా చెత్త బుట్టలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పరిసరాలు ప్లాస్టిక్ సీసాలు, కవర్లతో నిండిపోతున్నాయి.
పర్యాటకులకు ఇబ్బందులు: తాటిపూడి జలాశయం అవతల రూ.2 కోట్లతో నిర్మించిన ఎకో టూరిజం కేంద్రం ఉంది. క్యాంటీన్, కాటేజీలు నిర్మించారు. రణగొణ ధ్వనులు, వాహనాల కాలుష్యానికి దూరంగా కుటుంబంతో గడపాలనుకునే వారికి చక్కటి చోటు. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటవీశాఖ ఏర్పాటు చేసిన రెండు ఎకోటూరిజం కేంద్రాల్లో ఇదొకటి.
బోటు షికారు నుంచి ఇక్కడికి చేరాలంటే నీటిలో దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. కానీ బోట్లకు అనుమతి లేక పర్యాటకులు వెళ్లలేకపోతున్నారు. లేదంటే సుమారు 7.5 కిలోమీటర్ల రహదారిపై ప్రయాణించి చేరుకోవచ్చు. కానీ రాళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణించలేక వెళ్లడం మానేశారు. సాధారణ సమయాల్లో దాదాపు 400 నుంచి 500 వరకు పర్యాటకులు వస్తారు. అదే ఆదివారం, పండగ రోజుల్లో అయితే పర్యాటకుల తాకిడి ఇంచుమించు 2 వేలకు పైగానే ఉంటుంది.
''బోటు షికారు, ప్రకృతి చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక్క పూట గడపలేని పరిస్థితి ఉంది. కనీసం మరుగుదొడ్లు లేవు. రూ.150 ఉన్న టిక్కెట్ ధర కొంచెం తగ్గిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది'' -వై.సంధ్య, పర్యాటకురాలు
''త్వరలో జలాశయం గట్టు నుంచి గిరివినాయక కేంద్రం వరకు రోప్‌వే ఏర్పాటు చేస్తాం. ఈ ప్రదేశంలో పిల్లల పార్కు, వేచిఉండే గది, మరుగుదొడ్లు నిర్మిస్తాం. రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం'' -కొండపల్లి శ్రీనివాస్, మంత్రి