మీకు జాతీయ రహదారిపై సమస్య వచ్చిందా? - ఈ నెంబర్ మీ వెంట ఉంటే నో ప్రాబ్లం!
జాతీయ రహదారులపై 24x7 పనిచేసే హెల్ప్‌లైన్ 1033 - ఇంధనం దగ్గరి నుంచి అన్ని సేవలు అందుబాటులో - వినియోగదారులకు తక్షణ సహాయం

Published : October 4, 2025 at 3:10 PM IST
Toll Free Number for National Highway Complaints : జాతీయ రహదారి వినియోగదారులకు అత్యవసర సమయంలో '1033' హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది. ఏదైనా జాతీయ రహదారి మార్గంలో ప్రయాణించే టైంలో మీ వాహనానికి సమస్య వచ్చినా పొరపాటున ప్రమాదానికి గురైనా, ప్రమాదంలో చిక్కుకున్నా 1033 హెల్ప్‌లైన్‌ను ఉపయోగించుకోవచ్చు. చేయాల్సిందల్లా మీ ఫోన్ నుంచి ఆ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వడం మాత్రమే. 20 నుంచి 25 నిమిషాల్లో ఆయా బృందాలు వచ్చి తక్షణ సహాయం చేస్తాయి.
ఎప్పుడెప్పుడు ఏవేవో తెలుసా? : -
గాయపడితే : 1033 హెల్ప్‌లైన్ నేరుగా అంబులెన్స్ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడి ఉంటుంది. దీంతో ఫోన్ చేసిన తక్షణమే అత్యవసర వాహనం అందుబాటులోకి వస్తుంది. గోల్డెన్ అవర్‌లో వైద్యం అందటం ద్వారా ప్రాణనష్టం లేకుండా చేసే అవకాశం ఉంటుంది.
వాహనం దెబ్బతింటే : వాహనం పాడైపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తే పరిస్థితి ఉంటే క్రేన్ అందుబాటులోకి వస్తుంది. తక్షణమే వాహనాన్ని తొలగిస్తారు. నిమిషాల కాలంలోనే వాహనాల రాకపోకలు పునరుద్ధరిస్తారు.
ఇంధనం నిండుకుంటే : మార్గమధ్యలో వాహనంలో ఇంధనం అయిపోతే పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి ఐదు లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ తెచ్చి ఇస్తారు. ఇంధనం ధరను వాహనదారుడు చెల్లించాల్సి ఉంటుంది.
టైర్ పంక్చర్ అయితే : వాహనం టైరు పంక్చర్ అయితే పెట్రోలింగ్ సిబ్బంది టైర్ మార్చడానికి సాయపడతారు. యాంత్రిక సమస్య తలెత్తినా మెకానిక్‌లను, సహాయ వాహనాలను సమకూర్చుతుంది. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం.
ఏదైనా అపాయం ఎదురైతే : దోపిడీ, దాడులు తరహా ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ 1033కి నంబరుకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు. ఈ నంబరు పోలీసు స్టేషన్లు, హైవే పెట్రోలింగ్ యూనిట్లు, సమీప ఆస్పత్రులతో అనుసంధానమై ఉంటుంది.
- వినియోగదారులు తమకు తెలిసిన భాషలో సమాచారం అందించే అవకాశం ఉంది. మన దేశంలోని పలు భాషలను 1033 స్వీకరించి ఆపదను గుర్తిస్తుంది.
- జాతీయ రహదారిపై గుంతలు కనిపించినా, బారికేడ్లు దెబ్బతిని ఉన్నా, కొండచరియలు విరిగిపడ్డా, రహదారిపై చమురు చిందినా, చెట్లు కూలిపోయి కన్పించినా సమాచారం అందిస్తే తక్షణ చర్యలకు తోడ్పడుతుంది.
- ప్రమాద సమయంలో సెల్‌ఫోన్ చేజారిపోతే ప్రతీ కిలోమీటరుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన ఎస్‌వోఎస్ బాక్సుల వద్దకు వెళ్లి బటన్ క్లిక్ చేసినా 1033 హెల్ప్‌లైన్‌కు చేరుతుంది.
- సమస్య పరిష్కారం అయ్యాక సేవలు ఎలా ఉన్నాయని, మీ నుంచి ఎవరైనా నగదు ఆశించారా? అని మొబైల్ విచారణ చేస్తారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలా : -
- సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారి (365బిబి) 60 కి.మీ. విస్తరించి ఉంది. జిల్లా సరిహద్దులోని నాయకన్‌గూడెం సమీపంలో సింగరేణి టోల్‌ప్లాజా వద్ద అత్యవసర సేవా సామగ్రి, సిబ్బంది అందుబాటులో ఉంటాయని ఇన్సిడెంట్ మేనేజర్ కొండలరావు తెలిపారు.
- ఖమ్మం - కోదాడ జాతీయ రహదారి (365ఏ) 31 కి.మీ. ఉంటుంది. జిల్లా సరిహద్దు పైనంపల్లి టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటారు.
- ఇబ్రహీంపట్నం నుంచి జగదల్‌పూర్ (నెం.30) వెళ్లే జాతీయ రహదారి మొత్తం 440 కి.మీ. పొడవు ఉంటుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం టోల్‌ప్లాజా వద్ద అత్యవసర సిబ్బంది ఉంటారు.
యాచారం మీదుగా హైదరాబాద్ To అమరావతి జాతీయ రహదారి - 11 చోట్ల ఇంటర్ ఎక్స్చేంజీలు ఏర్పాటు
త్వరలోనే ఖమ్మం-దేవరపల్లి హైవేపై రయ్ రయ్ - చివరి దశకు చేరుకున్న పనులు

