AP Constable in Hyderabad Drugs Case : ఐదు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ విక్రయిస్తూ హైదరాబాద్‌లో పట్టుబడిన ముఠాలో కీలక సభ్యుడు తిరుపతి జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ఆసాంతం అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గుణశేఖర్ కుటుంబం వైఎస్సార్సీపీలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు. ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే జిల్లాలో పార్టీని శాసించిన పెద్దనేతకు అనుచరుడుగా ఉంటూ గుణశేఖర్ పలు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తిరుపతి ఎంపీకి గన్‌మెన్‌గా ఉంటూ అక్రమ సంపాదనకే పెద్దపీట వేసినట్లు తెలిసింది.
అవినీతి, అడ్డదారులే అర్హతగా కానిస్టేబుల్ గుణశేఖర్‍కు వైఎస్సార్సీపీ తమ పాలనలో పెద్దపీట వేసింది. నిందితుడి తల్లి మూర్తి మునెమ్మ సత్యవేడు నియోజకవర్గం కె.వి.బి.పురం మండలం వైఎస్సార్సీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా, తండ్రి మూర్తి సుబ్బయ్య ఆరె ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. గుణశేఖర్ 2003లో పోలీసుశాఖలో కానిస్టేబుల్‍గా విధుల్లో చేరారు. ప్రత్యేక పోలీసు విభాగంలో కొంతకాలం పనిచేసిన అతను బాంబు డిస్పోజబుల్ టీమ్‍లో విధులు నిర్వహించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొలువు దీరగానే తిరుమల ప్రొటోకాల్ డ్యూటీలు చేస్తూ దర్శనం పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు గుణశేఖర్‌పై ఉన్నాయి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి 26 వరకు వైఎస్సార్సీపీ నాయకుడు, తిరుపతి ఎంపీ గురుమూర్తికి గన్‌మెన్‌గా విధులు నిర్వహించారు. ఎంపీ దర్శనానికి సిఫార్సు చేసిన భక్తుడి నుంచి రూ.40,000లు తీసుకోవడంతో పాటు మరో భక్తుడి కుటుంబాన్ని లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో ఇతడి దందా వెలుగులోకి వచ్చింది. గన్‌మెన్ హోదాలో ఉంటూ పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎంపీ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వహిస్తూనే డ్రగ్స్ దందాకు తెరతీశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి కేంద్రంగా ఎర్ర చందనం స్మగ్లింగ్, గంజాయి అక్రమ రవాణాకు సహకరించారనే ఆరోపణలున్నాయి.
Cyberabad Cops Bust Drugs Gang : తిరుపతి రూరల్ మండలం పేరూరులో స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్న గుణశేఖర్ ఇంటి సమీపంలోని యువకుడితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో వివాహా సంబంధాల పేరుతో అతణ్ని మోసం చేసినట్లు తెలిసింది. తిరుపతిలో ఇంటి స్థలం ఉంటే మంచి సంబంధాలు వస్తాయని బాధితుడిని నమ్మించాడు. ఈ క్రమంలో ఆ యువకుడి పేరుతో స్వాతంత్య్ర సమరయోధుల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి రూ.22 లక్షలు వసూలు చేశారు.
చివరికి మోసపోయినట్లు గుర్తించిన సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కానీ అప్పుడు వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో ఫిర్యాదు చేసినా అధికార అండ ఉండటంతో గుణశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేయలేదు. డ్రగ్స్ దందా కేసు వెలుగులోకి వచ్చాక బాధితుడు ఫిర్యాదు చేయడంతో గుణశేఖర్, అతని భార్యపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
తన వద్ద కొంతకాలం పనిచేసిన గన్‌మెన్ గుణశేఖర్ డ్రగ్స్ దందాపై సీబీఐ విచారణ జరిపించి అసలు నిందితులను బయట పెట్టాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమితా షాకు లేఖ రాసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. తన దగ్గర పనిచేసిన గుణశేఖర్ అక్రమాలను తనకు అంటకట్టడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గురుమూర్తి హెచ్చరించారు
స్మార్ట్ టీవీ అట్టపెట్టెలు - ఓపెన్ చేస్తే అంతా షాక్
రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు - కానిస్టేబుళ్లను ఢీ కొట్టి పరార్