తిరుమల లడ్డూ కల్తీ కేసు - హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
తిరుమల లడ్డూ కల్తీ కేసులో వైవీ సుబ్బారెడ్డి, చిన్నప్పన్నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - ఈ కేసును విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 26, 2025 at 3:00 PM IST
TIRUMALA LADDU ADULTERATION CASE: వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది.
తిరుమల లడ్డూ కల్తీ కేసులో వైవీ సుబ్బారెడ్డి, చిన్నప్పన్నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాగా గతంలో సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చిన్నప్పన్నకు నోటీసులు జారీ చేసింది. దీంతో సిట్‌లో సుప్రీంకోర్టు చెప్పినవాళ్లను కాకుండా మరొకరిని తీసుకున్నారంటూ చిన్నప్పన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌లో లేని వ్యక్తి విచారణకు రావాలంటున్నారని హైకోర్టులో చిన్నప్పన్న పేర్కొన్నారు.
హైకోర్టు ఉత్తర్వులు: ఈ ఏడాది జులై 10న హైకోర్టు సింగిల్ జడ్జి చిన్నప్పన్న పిటిషన్‌పై తీర్పు ఇచ్చింది. సీబీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (FSSAI) అధికారి ఉండాలని హైకోర్టు గుర్తు చేసింది. కానీ, సీబీఐ డైరెక్టర్ ఆదేశాలతో జె వెంకటరావు అనే అధికారి, అధికారికంగా SITలో లేకపోయినా విచారణలో కీలకపాత్ర పోషించారని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ: హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ బి.ఆర్. గవాయి, జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును శుక్రవారం విచారించింది. సీబీఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. SIT మొత్తంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే ఉందని అని ఆయన వివరించారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు: “SITలోని అధికారులు ఒకరిని విచారణకు నియమిస్తే అందులో తప్పేముంది? దర్యాప్తు పర్యవేక్షణ సీబీఐ డైరెక్టర్ చేతిలోనే ఉంది” అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చిన్నప్పన్న తరఫున వాదించిన న్యాయవాది మాత్రం “వెంకటరావు దర్యాప్తు అధికారి పాత్ర పోషిస్తూ, తన క్లయింట్‌ను ఒత్తిడి చేస్తున్నారని” తెలిపారు. దీనిపై సీజేఐ “ఏమైనా ఒత్తిడి, బెదిరింపులు వస్తే ఫిర్యాదు చేయండి” అని సూచించారు.
సీబీఐకి ఉపశమనం: హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ, చిన్నప్పన్నకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు SIT దర్యాప్తు యథావిధిగా కొనసాగవచ్చని తేల్చింది. దీంతో సీబీఐకి తాత్కాలికంగా ఊరట లభించింది.
ఖాళీ లారీలు తిప్పి - సిట్‌కి 'దృశ్యం' సినిమా చూపించిన నిందితులు

