Tiranga Rally in Vijayawada : విజయవాడలో వేలాది మందితో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, నగరవాసులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలాపన చేశారు.
తీవ్రవాద రూపంలో ఎవ్వరూ దేశంలో అడుగుపెట్టినా వారికదే చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ లాంటి కార్యక్రమాలకు దేశం సిద్ధమని చెప్పారు. ఇది ప్రపంచంలోని ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలన్నారు. జాతి పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భరతమాత కీర్తి ప్రతాపాన్ని చాటుతూ తిరంగ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా భారత రక్షణ దళాలకు సెల్యూట్ అని చంద్రబాబు తెలియజేశారు.
"ఆడబిడ్డల కుంకుమ చెరిపిన వాళ్లు భూమ్మీద ఉండకూడదనే కేంద్రం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన మురళీనాయక్‌కు జోహార్లు. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు మనల్ని ఏం చేయలేవు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వారిని తుదముట్టించాలన్నదే మోదీ సంకల్పం. - చంద్రబాబు, ముఖ్యమంత్రి
ఇళ్లలో దూరి కొడతాం : అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి ఈనాటిది కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దేశాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తే కలిసికట్టుగా అందరం సమాధానమివ్వాలని చెప్పారు.సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించవద్దని తెలిపారు. దేశాన్ని కాపాడేది మురళీనాయక్ లాంటి నిజమైన హీరోలేనని పేర్కొన్నారు. పాకిస్థాన్ సరిహద్దు దాటి మన్నల్ని కొడితే మనం వారి ఇళ్లలో దూరి కొడతామని ఆపరేషన్ సిందూర్ ద్వారా చాటామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
మోదీ సర్కార్ ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసి ప్రపంచానికి భారత శక్తిని చూపించిందని విద్యార్థులు, ప్రజలు పేర్కొన్నారు. ఆర్మీ సరిహద్దుల్లో పహారా కాస్తూ అందరికీ రక్షణగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర జవాన్లకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ సేవలను కొనియాడారు.
'ఆపరేషన్ సిందూర్ - భారత సాయుధ దళాలకు వందనం'
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభపరిణామం: సీఎం చంద్రబాబు