Delay Rains in AP : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి. ఒక విధంగా చెప్పాలంటే వాతావరణశాఖ అంచనాలకన్నా వారం రోజులకు ముందే పలకరించాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. జూన్ నెల మొదటి పది రోజుల్లో దేశ వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది.
వాస్తవ స్థాయిలో కురవాల్సిన వర్షపాతం కన్నా 33 శాతం లోటు ఏర్పడిందని భారత వాతావరణశాఖ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముందొచ్చిన రుతుపవనాలు ఆ తర్వాత చురుగ్గా కదలకపోవడం, మధ్యలో నిలిచిపోవడంతో వర్షాలు కురవని పరిస్థితి ఏర్పడిందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్తులో భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆ మేరకు రుతుపవనాల కదలికల్లో మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.
ఆశించిన స్థాయిలో లేని వర్షపాతం: జూన్ 1 నుంచి 10వ తేదీ మధ్య కురిసిన వర్షపాత వివరాలను వాతావరణశాఖ ప్రకటించింది. దేశంలో సగటు వర్షపాతం 23.9 మిల్లీమీటర్లుగా నమోదయింది. ఈ సమయానికి సగటున 35.5 మి.మీ.కురవాలి. ఈశాన్య భారతంలో 83.8 మి.మీ. కురవాల్సి ఉన్నట్లయితే 69.8, వాయవ్య భారతంలో 14.8 కి 11.9, మధ్య భారతదేశంలో 26.4కు 21.4 మి.మీ.వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దక్షిణ భారతంలో 44.3 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 21.4 మి.మీ. మాత్రమే నమోదైనట్లు వాతావరణశాఖ ప్రకటించింది. గత నెల 29 నుంచి మహారాష్ట్ర, ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు నిలిచిపోవడంతో లోటు వర్షానికి కారణమని వాతావరణశాఖ పేర్కొంది. కానీ భారీ వర్ష సూచనలతో మున్ముందు లోటు సమస్య ఉండదని నిపుణులు వివరిస్తున్నారు.
బంగాళాఖాతంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో మార్పులు రుతుపవనాలను కొంత అస్థిరపరుస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల అందుకు ఒక కారణమంటున్నారు. అందుకే వేసవి వర్షాలు, వర్షాకాలంలో ఎండల ప్రభావం కనిపిస్తోదని చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో చాలా రోజులు వర్షాలు కురిశాయి. దీంతో వేసవి త్వరగా ముగిసిందన్న భావన కలిగింది. జూన్ ఒకటి నుంచి వర్షాలు కురవాల్సి ఉండగా కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం: ఈ నెల 12 నుంచి రుతుపవనాలు చురుకైన దశలోకి రానున్నాయి. జూన్ 14 వ తేదీకి తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ సమయంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.