Poisoning At School in Adilabad District : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాల వంట గదిలోని నీటిలో పురుగుల మందు కలిపిన ఘటనలో నిందితుడు సోయం కిష్టుని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే నిందితుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఎస్పీ అఖిల్ మహజన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 13, 14వ తేదీల్లో సెలవు కావడంతో ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. మంగళవారం (ఏప్రిల్ 15) ఉదయం పాఠశాలకు వచ్చి చూసేసరికి స్కూల్ వంటగదికి వేసిన తాళం పగులగొట్టి ఉండటాన్ని అక్కడి సిబ్బంది, ఉపాధ్యాయురాలు గమనించారు. వంట గదిలోని ఒక బకెట్‌లో ఉన్న నీరు తెలుపు రంగులో ఉండటాన్ని వారు చూశారు.
ఓ వ్యక్తిపై అనుమానం దిశగా : అనుమానం వచ్చి టీచర్ ప్రతిభ అక్కడి పాత్రలను చూసి వెంటనే సర్పంచ్, స్థానిక గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాలకు వచ్చి పరిశీలించగా నీటిలో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. వెంటనే ఉపాధ్యాయురాలు ప్రతిభ ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేశ్ ధర్మపురి పాఠశాల పరిస్థితిని పరిశీలించారు. ధర్మపురికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు.
ధర్మపురి గ్రామానికి చెందిన సోయం కిష్టు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తానే పాఠశాలలో పురుగుల మందు కలిపినట్లు అంగీకరించాడు. నిర్మల్‌లో ఉన్న తన సోదరుడి ఇంటి నుంచి పురుగుల మందు తీసుకొచ్చి పాఠశాల వంట గది తాళాన్ని పగులగొట్టి నీటిలో కలిపినట్లు విచారణలో అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటన వల్ల పాఠశాల విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగలేదని అన్నారు.
"కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా నిందితుడు మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. ఈ విషయం దర్యాప్తులో గుర్తించాం. తన ఇంట్లో వారిపై ఉన్న కోపంతో పాఠశాలలో పురుగుల మందు కలిపాడు. నిందితుడిని గుర్తించిన వెంటనే అరెస్టు చేశాం. 329(4), 324(6), 331(8), 332 BNS సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం" -అఖిల్ మహజన్, ఆదిలాబాద్ ఎస్పీ