Road Accident in America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన వారిని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి వాసులుగా గుర్తించారు. మృతులు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి (35), కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, 9 నెలల చిన్న కుమారుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం తెలిసింది. ఈ ఘటనతో టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికా ఫ్లోరిడాలో ఈ ప్రమాదం ఉదయం 3 గంటలకు జరిగింది.
ట్రక్కును ఢీ కొనడంతోనే : ప్రమాద సమయంలో కారును ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు. కారు, ట్రక్కును బలంగా ఢీ కొనగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి రోహిత్ రెడ్డి అమెరికాలో నివాసం ఉంటున్నారని సన్నిహితులు తెలిపారు. మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడం ఇబ్బందికరంగా ఉండడంతో కుటుంబ సభ్యులే మధ్యాహ్నం అమెరికాకు బయరిదేరినట్లు తెలిపారు. మృతదేహాలు నుజ్జునుజ్జు కావడం వల్ల దహన సంస్కారాలు అమెరికాలోనే చేస్తున్నట్లు వెల్లడించారు.
పవిత్ర దేవి మోహన్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రగతి రెడ్డి చిన్న కుమార్తె కాగా, పెద్ద కుమార్తె కూడా అమెరికాలోనే ఉంటున్నారు. ఆదివారం కావడంతో ఇద్దరు కుమార్తెలు కుటుంబ సభ్యులు విందు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.
బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా - మహిళ మృతి, ముగ్గురికి గాయాలు - Road Accident In Hyderabad
హైదరాబాద్‌లోనే అత్యధికంగా కారు ప్రమాదాలు - వెల్లడించిన ప్రముఖ సంస్థ