Three Students Die While Swimming at Chittoor District : ఇటీవలే అంబేడ్కర్ కోనసీమ జిల్లా కమినిలంక వద్ద 8 మంది యువకులు గోదావరిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మనందరికీ తెలుసు అది మరవకముందే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక పరిధిలోని రావిలంక వద్ద మంగళవారం స్నానం కోసమని ముగ్గురు బాలురు గోదావరి నదిలో దిగి గల్లంతయ్యారు. వీటి నుంచి పూర్తిగా కోలుకోకముందే చిత్తూరు జిల్లాలో మరో ఘటన జరిగింది.
వి.కోట మండలం మోట్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో ఎనిమిదో తరగతి చదువుతున్న వారంతా ఈతకు వెళ్లారు. నీట మునిగిన వారిని కాపాడేందుకు ఒడ్డున ఉన్న మరికొందరు విద్యార్థులు యత్నించారు. అప్పటికే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతులను మోట్లపల్లి గ్రామానికి చెందిన కుషాల్, నిఖిల్, జగన్‌గా గుర్తించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు.
ముగ్గురు యువకుల మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి సెలవుల్లో చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల మృతి ఎంతో దురదృష్టకరమన్నారు. ఈ విషయం ఆయన్ని ఎంతగానో కలచివేసిందని చెప్పారు. స్థానిక అధికారులతో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడి ఘటనపై వివరాలు ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.