Three People Died in Hyderabad : హైదరాబాద్లోని సనత్నగర్ ఏరియాలోని ఓ అపార్టుమెంట్ బాత్రూంలో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సనత్నగర్ జెక్ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్టుమెంట్ రెండో అంతస్తులోని ఫ్లాట్లో ఈ ముగ్గురి మృతదేహాలు ఉన్నాయి. ఈ మిస్టరీ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సనత్నగర్లో జెక్ కాలనీలోని అపార్టుమెంట్లో ఆర్.వెంకటేశ్(55), మాధవి(50), హరి(30) నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. దీంతో బాత్రూమ్లో ఉన్నారేమోననుకుని ఇంట్లో పనిచేసి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అనుమానం వచ్చి బాత్రూమ్ వైపు చూడగా డోర్ లాక్ చేసి ఉంది. అనుమానంతో స్థానికులకు సమాచారం అందించగా అపార్ట్మెంట్ వాచ్మెన్ డోర్ పగులుగొట్టి చూశాడు. అప్పటికే ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు.
అనుమానాస్పద కేసు నమోదు : వెంటనే అపార్ట్మెంట్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తొలుత విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులు భావించారు. కానీ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందడంతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
భార్య, కుమార్తెను చంపి భర్త ఆత్మహత్య - ఏం జరిగిందంటే? - MAN KILLS WIFE AND DAUGHTER IN HYD