Threats to Vijayashanti Couple in Hyderabad : కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు డబ్బుల కోసం వచ్చిన బెదిరింపు సందేశాలు కలకలం రేపుతున్నాయి. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి బెదిరింపు సందేశం పంపాడని, బకాయిలు తీర్చకుంటే మీరే శత్రువులు అవుతారని మెసేజ్ చేశాడని విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమోదయోగ్యంకాని రీతిలో మెసేజ్‌లు ఉన్నాయని, అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు బీఎన్‌ఎస్ యాక్ట్ 351(2), 351(3) సెక్షన్ల ప్రకారం చంద్రకిరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా హ్యాండ్లర్‌గా అవకాశం : 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి తమను సంప్రదించినట్లు విజయశాంతి భర్త తెలిపారు. చంద్రకిరణ్ రెడ్డి సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా పరిచయం చేసుకున్నాడని, విజయశాంతి వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్‌గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
పనితీరు నచ్చలేదు : చంద్రకిరణ్ రెడ్డి తమతో కలిసి పనిచేస్తున్న క్రమంలో బీజేపీ అగ్రశ్రేణులతో పరిచయాలు చేసుకుని స్వలాభం కోసం తమ పేరును వాడుకున్నాడని ఆరోపించారు. అనంతరం పనితీరు నచ్చకపోవడంతో చంద్రకిరణ్‌ను దూరం పెట్టినట్లు శ్రీనివాస ప్రసాద్ తెలిపారు.
నగదు చెల్లింపులు చేయగలరా? : తాము బీజేపీలో ఉన్నప్పుడు చంద్రకిరణ్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ పార్టీలో ఎదిగేందుకు తమను వాడుకున్నట్లు చెప్పారు. బీజేపీ నుంచి బయటికి వచ్చాక చంద్రకిరణ్ రెడ్డి నుంచి మెసేజ్ వచ్చిందని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా? అని చంద్రకిరణ్ ఏప్రిల్ 06వ తేదీన మెసేజ్ పంపాడని దానికి బదులుగా తాము బకాయిలు ఏమీ లేవని సమాధానమిచ్చినట్లు తెలిపారు.
శత్రువులుగా మారుతారని : నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకుంటే మీరు శత్రువులుగా మారుతారని బజారుకీడ్చడంతో పాటు అంతు చూస్తానంటూ బెదిరింపు సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ ఘటన జరగడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.