Thief done Hundred Cellphone Thefts : ఒక వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఆ పక్కనే ఉన్న వ్యక్తి అతడిని గమనిస్తూ ఉన్నాడు. ఆ విషయం ఈ వ్యక్తికి తెలియలేదు. ఎప్పుడు ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ పెడతాడా అన్నట్లు చూస్తున్నాడు. మాటలు అయిపోయిన తర్వాత తన స్టాప్ రాగానే సెల్‌ఫోన్‌ను జేబులో పెట్టాడు. ఇదే అదనుగా భావించిన సదరు వ్యక్తి ఆ ఫోన్‌ను ఠక్కుమని దోచుకొని అక్కడి నుంచి పరారీ అయ్యాడు.
మరో వ్యక్తి రోడ్డు మీద ఫోన్‌లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నాడు. వెనుకనే మరో వ్యక్తి వచ్చి లటుక్కున ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఇలాంటి సెల్‌ఫోన్ ఘటనలు నిత్యం నగరంలో జరుగుతూనే ఉన్నాయి. సెల్‌ఫోన్ దొంగలు ఒకటో రెండో లేదంటే పదో చోరీ చేసుంటారు. కానీ ఈ దొంగ మాత్రం ఏకంగా 100కు పైగా ఫోన్లను దొంగలించి సెంచరీ దొంగగా మారాడు.
గోల్కొండ ఏసీపీ ఫయాజ్, లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మొఘల్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జలీల్ హుస్సేన్ ఈనెల 7న ఉదయం తన కుమారుడిని లంగర్ హౌస్ బస్టాప్ వద్ద దింపాడు. విద్యార్థి బస్సులో బాపూఘాట్ తపోవనం చేరుకునే సరికి జేబులో ఉన్న సెల్‌ఫోన్ కనిపించలేదు. మరుసటిరోజు జలీల్ హుస్సేన్ లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే పోలీసులు బస్టాపుల్లో మఫ్టీలో నిఘా ఏర్పాటు చేశారు.
105 సెల్‌ఫోన్లు చోరీ : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మపురం గ్రామానికి చెందిన ఎరుకుల కావడి అశోక్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.అతని ఆధార్, వేలిముద్రల ఆధారంగా అతడే ఘరానా దొంగ అని పోలీసులు తేల్చారు. అతడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువ చేసే 105 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో అతడి స్నేహితుడు గణేశ్ పరారీ అయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.