Delay in release of gas subsidy : 'మహాలక్ష్మి' స్కీమ్‌లో భాగమైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్’ రాయితీ విడుదలలో జాప్యం నెలకొంది. గత 3 నెలలుగా ఈ రాయితీ జమ కావడం లేదు. ఈ పథకం కింద మొత్తం రూ.150-180 కోట్ల వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.915గా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ లబ్ధిదారులు ఆ మొత్తం చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకుంటుండగా, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.375 సబ్సిడీ అందజేస్తోంది. కేంద్రం సబ్సిడీ రూ.40 కూడా కలిపి లబ్ధిదారులు సిలిండర్‌కు పెట్టే ఖర్చు రూ.500 అవుతుంది. ఇలా జమ అయిన రూ.415 రాయితీకి రూ.500 కలిపి తర్వాత సిలిండర్ తీసుకుంటున్నారు. 3 నెలలుగా రాష్ట్ర సబ్సిడీ జమ నిలిచిపోవడంతో మొత్తం చేతి డబ్బులే ఖర్చు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ రాయితీ చెల్లింపులు జరుగుతాయి : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌కార్డుల ఆధారంగా గ్యాస్ సబ్సిడీకి 39.57 లక్షల మంది అర్హులుగా తేలారు. ఏడాదికి రాయితీ ఇవ్వాల్సిన వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం సబ్సిడీ కింద రూ.855.22 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసి, ఆ మేరకు నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించారు. ప్రతి నెలా సుమారు రూ.80 కోట్లు జమ చేస్తుండగా, వినియోగదారులకు వెంటవెంటనే రాయితీ డబ్బులు పడేవి. మూడు నెలలుగా ఈ నిధులు విడుదలలో జాప్యం జరుగుతోంది. కొంత ఆలస్యమైనప్పటికీ గ్యాస్ రాయితీ చెల్లింపులు జరుగుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
వంట గ్యాస్ ధరల పెంపు- ఎంత పెరిగిందంటే?
కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలా? - ఆన్లైన్లో సింపుల్‌గా అప్లై చేసుకోండిలా!