Thefts Rising In Telangana : వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి టూర్లు, రాష్ట్రంలోని వివిధ పుణ్య క్షేత్రాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది. తాళం వేసి ఉన్న నివాసాలనే లక్ష్యంగా చేసుకుంటున్న దొంగలు చెలరేగిపోతున్నారు. నెల రోజులుగా ఏదో ఒకచోట ఈ చోరీ ఘటనలు దడ పుట్టిస్తున్నాయి. పగలు రెక్కీ నిర్వహిస్తూ, రాత్రి దొరికినంత దోచేస్తున్నారు. అపార్టుమెంట్లలోనూ దొంగతనాలు జరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి : రైలు ప్రయాణం ప్రధాన నగరాలకు చేరుకునేందుకు అత్యంత సులభంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగలు సులువుగా చోరీలు చేసి పారిపోతున్నారు. మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు నుంచి ఎక్కువగా వస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో కాలనీలు తిరుగుతూ ఎక్కడి ప్రాంతాల్లో తాళాలు వేసి ఉంటే వాటిని టార్గెట్ చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం రాత్రి సమయంలో దొంగతనాలకు తెరలేపుతున్నారు. ఒక్కో ముఠాలో నాలుగు నుంచి ఆరుగురు సభ్యులు ఉంటున్నారు.
ఇటీవలి ఘటనలు
- హనుకొండలోని కోమటిపల్లి భద్రకాళి నగర్లో మార్చి 11న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులంతా ఊరికి వెళ్లారు. 12వ తేదీ ఉదయం వచ్చి చూసేసరికి దొంగలు ఇంటిని గుల్లచేశారు. తాళం పగులగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
- భూపాలపల్లి టౌన్లో నాలుగు రోజుల కిందట సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఉన్న సింగరేణి క్వార్టర్స్‌లో తాళం పగులగొట్టి 8 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి, రూ.20 వేల నగదు చోరీ చేశారు.
- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్యకాలనీలో ఓ ఇంటి తాళం ధ్వంసం చేసి బీరువాలోని ఐదు తులాల బంగారం, రూ.50 వేలు దోచేశారు.
సురక్షిత పద్ధతులు ఇలా
- ఎక్కడైనా బయటకు వెళ్లాల్సి వస్తే ఇంట్లో ఎవరైనా ఒకరిని ఉంచి వెళ్లడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే తాళం వేసినట్టు కనిపించకుండా డోర్ కర్టెన్ వేయాలి. ఇంట్లో లైట్లు వేసి ఉంచితే ఎవరో ఉన్నారనే సందేశం దొంగలకు చేరుతుంది. దాని వల్ల వారు అటుగా రారు.
- బంగారు నగలు, విలువైన వస్తువులు, నగదు బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలి లేదంటే వెంట తీసుకెళ్లడం సురక్షితమైన పద్ధతి.
- సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఆన్‌లైన్ ద్వారా మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే ఇంట్లోకి ఎవరు ప్రవేశించినా వెంటనే తెలిసిపోతుంది.
- ఎక్కువ రోజులు ఊరికి వెళ్లాల్సి వస్తే చుట్టూపక్కల వారికి కొంచెం గమనించమని చెప్పాలి. సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారమిస్తే పోలీసులు ఆ కాలనీలో గస్తీ నిర్వహిస్తారు.
- ఇంటికి వేసే తాళాలను నాణ్యమైన కంపెనీవైతేనే వాడాలి. ప్రస్తుతం తలుపులు తెరిస్తే అలారం వచ్చే డోర్లు కూడా వచ్చాయి. వీటిని బిగించుకుంటే మేలుగా ఉంటుంది.
"వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లిన సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు వదిలేయోద్దు. పాల ప్యాకెట్లు, న్యూస్‌పేపర్ వేసేవారిని ఊరికి వెళ్లి వచ్చే వరకు వాటిని వేయవద్దని చెప్పాలి. ఎక్కువ రోజులు వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. కాలనీల్లో కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి" -జనార్దన్, నేర విభాగం డీసీపీ
ఆ ఊరోళ్లు చోరీల్లో మొనగాళ్లు - ముఖ్యంగా అవే వారి టార్గెట్
దమ్ముంటే పట్టుకోండి చూద్దాం - 'దొంగ తెలివి'తో పోలీసులకే సవాల్