Special Story of Araku Coffee: వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి. ఇప్పుడు తాగితే అరకు కాఫీనే తాగాలనేది తెలుగు రాష్ట్రాలు సహా దేశ విదేశాల్లోని కాఫీ ప్రియుల అభిప్రాయం. ప్రపంచంలో ఎన్నో కాఫీలు ఉన్నా వాటికి రాని భిన్నమైన ఖ్యాతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీకి వచ్చింది. ఇప్పటికే లండన్ లాంటి నగరాల్లో అడిగి మరి విదేశీయులు అరకు కాఫీ తాగుతున్నారు. ఇప్పుడు మన అరకు కాఫీ మరిన్ని విదేశాలకు అత్యంత ప్రీతికరమైన పానీయం. అందుకే మన దేశ రాజ్యాంగ దేవాలయంగా చెప్పే పార్లమెంట్ లో సైతం అరకు కాఫీకి ఒక స్థానం ఇచ్చారు. ప్రకృతి సిద్ధంగా పండిన కాఫీ గింజలు అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించి వాటిని కాఫీ గా మార్చే గిరిజనులు కష్టం ఎక్కడికి పోలేదన్నది సుస్పష్టం.
ఖ్యాతి గడించిన అరకు కాఫీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో అరకు కాఫీ మరింత ఖ్యాతిని కీర్తిని తెచ్చేలా చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ముఖ్యంగా అల్లూరి జిల్లా ప్రాంతంలో గిరిజనులు సహజ సిద్ధంగా ఏ రకమైన ఎరువులు వాడకుండా ఈ కాఫీ పంటను సాగు చేస్తారు. ఈ విధంగా తయారైన కాఫీ గింజల నుంచి చక్కటి ప్రమాణాలను పాటిస్తూ కాఫీ గింజలను ఉత్పత్తి చేయడం, కాఫీ పొడిగా తయారు చేయడం గిరిజన సహకార సంస్థ ఇప్పుడు చేస్తున్న ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన జీవితాల్లో వెలుగు నింపాలనే సదుద్దేశంతో కాఫీ పంట ద్వారా గిరిజనులకు ఆర్థిక ప్రగతిని కలుగజేయాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది.
అరకు కాఫీకి భౌగోళిక గుర్తింపు: దేశ విదేశాలకు సేంద్రీయ సాగులో అరకు కాఫీ రైతులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ సాధించిన ఐదు కాఫీ రకాలలో అరకు కాఫీ ఒకటిగా నిలిచింది. చాలా కాఫీలు ఉన్నా సరే అరకు కాఫీకే ఎందుకు అగ్ర కిరీటం దక్కుతోంది అంటే అరకులో చల్లని వాతావరణం కొండ లోయ ప్రాంతాల్లో మట్టి , కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన గిరిజనం పండించే కాఫీలో ఏ రసాయనాలు వినియోగించరు. పిక్కలు కోసి సహజమైన సూర్య వెలుతురులో ఎండపెడతారు .అందుకే రుచిలోనూ ఆ స్వచ్ఛత కన్పిస్తుంది.అరకు పర్యాటకులకు అక్కడి కొండ వాలు ప్రాంతాల్లో ఎత్తైన చెట్ల మధ్య కాఫీ తోటలు చూపరులను పలకరిస్తాయి. ప్రపంచంలో కాఫీ సేవించే వారిని ఆకట్టుకోవడంలో అరకు కాఫీ ముందంజలో ఉంటోంది. రుచిలో మేటిగా నిలుస్తున్న అరకు కాఫీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు పేరు తెచ్చి పెడుతోంది
కొనేళ్ల క్రితం జర్మనీకి చెందిన గ్లోబల్ ల్యాండ్ స్కేప్స్ సంస్థ గ్లోబల్ ల్యాండ్ స్కేప్ హీరోస్ కోసం నిర్వహించిన నామినేషన్లలో అరకు రైతులు ప్రధమ స్ధానంలో నిలవడం అంతర్జాతీయంగా అరకు కాఫీ ఖ్యాతిని మరింత పెంచింది. అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండింగ్ లో నిలిపేందుకు నాంది అనే సంస్థ గత దశాబ్ద కాలానికి పైగా కృషి చేసింది. ముఖ్యంగా కాఫీ రైతులకు సేంద్రీయ సాగు విధానాన్ని పరిచయం చేయడం విజయంలో తొలి మెట్టుగా చెప్పాలి. విశాఖ మన్యంలో నాంది సంస్థ భాగస్వామ్యంతో 40 వేల మంది వరకు కాఫీ రైతులు సాగు చేస్తున్నారు.
పారిస్‌లో బంగారు పతకం: వీరంతా సేంద్రీయ పద్ధతిలో కాఫీ తోటను సాగు చేస్తున్నారు. గిరిజనుల కృషితో పెంపొందించిన పచ్చదనం 4.5 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్ఘారాలను పీల్చేస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తోంది. 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదట పారిస్ ప్రజలకు అరకు కాఫీ రుచిని చేరువ అయ్యింది. అంతేకాదు పారిస్ లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రిక్స్ ఎపిక్యూర్ -2018 పోటీల్లో బంగారు పతకాన్ని మన అరకు కాఫీ సొంతం చేసుకుంది.
ప్రధాని మోదీ ప్రశంసలు: రెండు దశాబ్దాల నుంచి మన్యంలో కాఫీసాగును ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది. కాఫీ సాగు చేయడంలో నీడ ఎంతో కీలకం. అందుకోసం అవసరమైన సిల్వర్ ఓక్ మొక్కలను పంపిణీ చేయడం కాఫీ మొక్కలు నాటించడం అది సాగు చేసేందుకు అవసరమైన వనరుల్ని సమకూర్చడం ఇలా వివిధ దశల్లో ఐటీడీఏ అందించిన ప్రోత్సాహం మన్యంలో కాఫీ సాగుకు పునాది వేసింది. ప్రస్తుతం 2.41 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కాఫీ సాగు చేస్తున్నారు. ఇందులో లక్ష ఎకరాలు పైగా గిరిజన రైతులు సొంతంగా సాగు చేస్తున్నదే. మిగిలిన విస్తీర్ణంలో ఏపీఎఫ్డీసీ, కాఫీ బోర్డు ఆధ్వర్యంలో సాగు జరుగుదోంది. జీసీసీ , ఐటీడీఏ అందించిన ప్రోత్సాహానికి గిరిజన రైతులు ముందుకు వచ్చి సేంద్రీయ పద్ధతిని అలవాటు చేయడంతో ఇప్పుడు అరకు కాఫీ ప్రపంచం కాఫీ ప్రేమికుల మన్ననలు పొందుతోంది. అందుకే మన్ కి బాత్ లో సైతం ప్రధాని మోదీ ప్రశంసలు పొందింది.
ఏటా విశాఖ ఏజెన్సీలో 12 వేల టన్నులకు పైగా కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి. వీటిని జీసీసీ, నాంది ఫౌండేషన్ తో పాటు కొందరు దళారులు కాఫీ పండ్లు, గింజలను కొనుగోలు చేస్తున్నారు. కాఫీ గింజలకు మంచి ధర కల్పించాలనే ఉద్దేశంతో జీసీసీ కొనుగోలు ప్రారంభించిన తరువాత రైతులకు మరింత దన్ను దొరికినట్లు అయింది. 2016 లో కిలో 130 రూపాయిలు ఉండే కాఫీ ఇప్పుడు 2024 లో కిలో 450 రూపాయిలు ఇచ్చి జిసిసి కొనుగోలు చేస్తోంది. కాఫీ మార్కెట్ లో మంచి ధరను అరకు బ్రాండ్ తీసుకువచ్చే దిశగా జీసీసీ కృషి చేస్తోంది.
బ్రాండింగ్ పెంచే ప్రయత్నం: అరకు కాఫీని వివిధ ఫ్లేవర్స్ తో మార్కెట్ లోకి తీసుకువచ్చి మంచి గిరాకీ వచ్చేలా చేయడంలోనూ జీసీసీ విజయం సాధిస్తోంది. దీనితో పాటు రాష్ట్రంలోని విమానాశ్రయాలు ప్రముఖ పర్యాటక, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో జీసీసీ స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా బ్రాండింగ్ ను మరింత పెంచే ప్రయత్నాన్ని చేస్తున్నారు జీసీసీ అధికారులు. వివిధ దేశాల్లోను అరకు కాఫీ రుచులు పరిచయం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నట్టు చెబుతున్నారు.
''గిరిజన జీవితాల్లో వెలుగు నింపాలనే సదుద్దేశంతో కాఫీ పంట ద్వారా గిరిజనులకు ఆర్థిక ప్రగతి సాధించడమే మా ప్రభుత్వ లక్ష్యం. అరకు కాఫీని బ్రాండింగ్ పెంచే ప్రయత్నం చేస్తాం. పార్లమెంట్లో సైతం దాని ప్రస్తావన రావడం ఎంతో సంతోషంగా ఉంది. అంతే కాకుండా దేశ విదేశాల్లో సైతం దీని ప్రత్యేకతను చాటే ప్రయత్నం చేస్తాం''- కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ
''ఈ సంవత్సరం జీసీసీ నుంచి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది. గత 3 సంవత్సరాలుగా దీని కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈ సర్టిఫికేషన్ వలన ఎగుమతుతి చేయడానికి సులభతరంగా ఉంటుంది. అంతే కాకుండా వివిధ రకాల బ్రాండింగ్‌ల ద్వారా దీన్ని మరింత పెంచేందుకు అవకాశం ఉంటుంది''-కల్పనా కుమారి,ఎండీ,జీసీసీ