Ontimitta Ramalayam : ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి సీతారామకల్యాణ మహోత్సవం ఈ నెల 11న జరగనుంది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ శుక్రవారం కల్యాణం నిర్వహించనుండగా అందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు వెల్లడించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు, శ్రీవారి సేవకులతో సమీక్ష నిర్వహించారు.
గ్యాలరీలలో ఉండే భక్తులకు కల్యాణ తలంబ్రాలు, స్వామి వారి ప్రసాదం, అన్నప్రసాదాలను క్రమపద్ధతిలో అందించాలని సూచించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాహనాల పార్కింగ్, గ్యాలరీలోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణలో క్రమపద్ధతి పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలో, జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒంటిమిట్ట రామయ్య క్షేత్రం
భక్తితో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులను ఈవో ఈ సందర్భంగా అభినందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో సంయమనంతో ఉండాలని పోలీసులను కోరుతూ గ్యాలరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.

మరో భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన సీతారాముల కల్యాణ వేదిక కలశాకృతిలో ఆకట్టుకుంటోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని ఈ రామయ్య క్షేత్రం నుంచి ఇటీవల తీసిన డ్రోన్ వీడియో, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత భద్రాద్రికి బదులు ఇక్కడే శ్రీరామనవమి వేడుకలను నిర్వహించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించగా ఆ తర్వాత 2015 సెప్టెంబరు 9న ఆలయాన్ని టీటీడీలో విలీనం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరపున స్వామివారి కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులందరూ విచ్చేసి శ్రీరాముని కృపకు పాత్రులు కాగలరని ఒంటిమిట్ట ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు కోరారు.
శ్రీ కోదండరామ స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో స్థానికంగా సీఎం పర్యటించే ప్రాంతాలను ఈవో వెంకయ్య చౌదరి ఒక రోజు ముందుగా బుధవారమే పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహం వద్ద సీఎం బస చేయనున్న గదులలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, తాజా పుష్పాలతో పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలని సూచించారు.
11న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం - భక్తులకు 70 వేల తిరుమల లడ్డూలు