BUDAMERU CANAL MODERNIZATION: అధికారంలో ఉన్నప్పుడు జలవనరుల శాఖను వైెస్సార్సీపీ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయకపోగా, కనీసం కాలువల్లో తట్టెడు మట్టిని తీయలేదు. దీంతో ఎక్కడికక్కడ మట్టి కూరుకుపోయింది. ఫలితంగా గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ సమీపంలోని బుడమేరకు భారీ గండ్లు పడ్డాయి. వరద నీరంతా పంట పొలాలు, బెజవాడ నగరంలోకి చేరింది. ఈ క్రమంలోనే ఆ ముప్పు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు తలంచారు. అందులో భాగమే రిటైనింగ్ వాల్ నిర్మాణం. అయితే ఈ వాల్ నిర్మాణం చేపడుతున్నారా? పనులు ఎంత మేర సాగుతున్నాయి.
గత సంవత్సరం సంభవించిన బుడమేరు వరద విజయవాడను అతలాకుతలం చేసింది. అనంతరం కూటమి సర్కారు వేగంగా దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ నగర ప్రజల్లో మాత్రం భవిష్యత్తులో వరద భయం పోలేదు. ఫలితంగా వరద నుంచి ప్రజలకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం పనులను చేపట్టింది. బుడమేరు డైవర్షన్ కెనాల్‌పై రక్షణగోడ నిర్మాణం వేగంగా జరుగుతోంది.
నెలాఖరులో పూర్తిచేయాలనే దిశగా పనులు: వైఎస్సార్సీపీ అసమర్థ పాలనలో కాలువల్లో తట్టెడు మట్టి తీయలేదు. దీంతో అధిక వర్షాలకు ఊళ్ల నుంచి విజయవాడ లాంటి నగరాలు సైతం ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఈ పరిణామాల నుంచి ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. రూ.28 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన రక్షణ గోడ పనులను సగం పూర్తి చేశారు. కింది గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా కొత్త వంతెనను నిర్మించారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. నెలాఖరులోగా రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని అని ఆర్‌ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
నిర్మాణ పనుల వివరాలిలా: ప్రస్తుతం చేస్తున్న పనులతో పాటు బుడమేరులో 36 కిలోమీటర్ల మేర పూడికతీత, ఆక్రమణల తొలగింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు బుడమేరుకు సమాంతరంగా కొత్త కాలువను తవ్వి నీరు మళ్లించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎనికేపాడు యూటీ ఛానల్ నుంచి కొల్లేరు వరకు బుడమేరు కాలువను వెడల్పు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు.
విజయవాడ పరిధిలోని శాంతినగర్ సమీపంలో బుడమేరు డైవర్షన్ కెనాల్‌పై రక్షణగోడ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రక్షణ గోడను గట్టు నుంచి 11 మీటర్ల లోతు నుంచి గట్టుపై 8.6 మీటర్ల ఎత్తు వరకు నిర్మించనున్నారు. మొత్తం 500 మీటర్ల పొడవునా గోడ నిర్మాణం చేపడుతుండగా 200 మీటర్ల మేర ర్యాఫ్టింగ్, బిడ్డింగ్ పనులను పూర్తి చేశారు. 1.5 మీటర్ల మేర గోడ నిర్మాణం పూర్తి చేశారు. రక్షణ గోడకు సమాంతరంగా ఏర్పాటు చేస్తున్న గట్టును ఏర్పాటు చేస్తున్నారు. కాలువలకు నీరు వదిలినప్పటికీ పనులకు ఇబ్బంది, ఆటంకం కలగకుండా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వర్షం నీరు తోడేందుకు మోటార్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
గతేడాది బుడమేరు డైవర్షన్ కెనాల్ విధ్వంసం సృష్టించింది. దీని సామర్థ్యం 10 వేల క్యూసెక్కులు కాగా అప్పుడు 60 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. నివారణకు 11.9 కిలోమీటర్ల మేర చేపట్టిన పూడిక తీత పనుల్లో 99 శాతం పూర్తి చేశారు. నిల్వ సామర్థ్యాన్ని 37,755 క్యూసెక్కులకు పెంచారు.
రిటైనింగ్ వాల్ కట్టగలరా - బుడమేరు ప్రక్షాళన సాధ్యమయ్యేనా?
బుడమేరు వరద ప్రవాహాన్ని సముద్రంలోకి తరలించేలా కార్యాచరణ : మంత్రి నిమ్మల