ETV Bharat / state

కరెంట్​ బిల్లు కట్టలేదంటూ మెసేజ్​లు​, ఫోన్​కాల్స్ వస్తున్నాయా? - అయితే జాగ్రత్త పడండి

కరెంట్​ బిల్లు చెల్లింపులపై మోసపూరిత ఫోన్​కాల్స్​ విషయంలో బీకేర్​ఫుల్​ - విద్యుత్​ బిల్లుల చెల్లింపులకు తాము ఎలాంటి లింక్​లు పంపమన్న టీజీఎస్పీడీసీఎల్​ సీఎండీ

TGSPDCL CMD on Fake Calls messages
TGSPDCL CMD on Fake Calls messages (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 26, 2025 at 7:45 PM IST

2 Min Read
Choose ETV Bharat

TGSPDCL CMD on Fake Calls messages : విద్యుత్ బిల్లుల చెల్లింపుపై మోసపూరిత ఫోన్​కాల్​లు, సందేశాలను నమ్మవద్దని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ కోరారు. అలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కొంత మంది వ్యక్తులు తమ వినియోగదారులను మెసేజ్​లు, ఫోన్​ల ద్వారా సంప్రదించి విద్యుత్ బిల్లులు, వాటి బకాయిలు పెండింగ్​లో ఉన్నాయని, వెంటనే కట్టకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. వారిని వెంటనే సంప్రదించాల్సిందిగా దుండగులు ఒక మొబైల్ నెంబర్​ను పంపుతున్నట్లుగా తెలిసిందని ఆయన వివరించారు.

అలాంటి మెసేజ్​లు, ఫోన్​కాల్స్​తో జాగ్రత్త : విద్యుత్​ బిల్లల పేరుతో మోసగాళ్లు పంపించేటువంటి మెసేజ్​లను నమ్మవద్దని ముషారఫ్ కోరారు. అలాంటి సందేశాలు, ఫోన్​కాల్స్​ను నమ్మి సంప్రదించి అకౌంట్, డెబిట్​ కార్డు వివరాలిచ్చిన వినియోగదారుల ఖాతాల నుంచి నగదును విత్​డ్రా చేస్తూ మోసగిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. దీనిపై తమకు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

విద్యుత్ వినియోగదారులు, ప్రజలు ఇలాంటి మోసపూరిత మెసేజ్​లు నమ్మి మోసపోవద్దని సీఎండీ ముషారఫ్ ఫరూఖి విజ్ఞప్తి చేశారు. టీజీఎస్పీడీసీఎల్ పంపే సందేశాలలో విభాగం పేరు, యూ.ఎస్.సీ, సర్వీస్ నంబర్, వినియోగదారుని పేరు, బిల్లు మొత్తం ఉంటాయని స్పష్టం చేశారు. టీజీఎస్పీడీసీఎల్ ఎప్పుడూ మొబైల్ నంబర్ నుంచి సందేశాలు పంపదని తెలిపారు. టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు చెల్లింపు రసీదు తప్ప బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలను ఎన్నడూ సేకరించరన్నారు.

వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్​ విజ్ఞప్తి : సంస్థ బిల్లుల చెల్లింపు కోసం ఎస్.ఎం.ఎస్ సందేశం ద్వారా ఎటువంటి వెబ్‌సైట్ లింక్‌లను పంపదని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ పరూఖి తెలిపారు. విద్యుత్ వాడకం బిల్లులు, బకాయిల వివరాలను విద్యుత్ బిల్లు ద్వారా వినియోగదారులకు తెలియజేస్తుందన్నారు. వినియోగదారులు సంస్థ వెబ్‌సైట్ www.tgsouthernpower.org లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా ప్రస్తుత వినియోగ బిల్లులు, బకాయిల సమాచారాన్ని పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. సంస్థ రాత్రిపూట, అర్ధరాత్రి విద్యుత్ సరఫరాను నిలిపివేయదని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులు బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సీఎండీ సూచించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం అనుమానాస్పద లింక్​లను అనుసరించవద్దని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా?- ఈ టిప్స్ పాటిస్తే సగం డబ్బులు మిగిలినట్లే! - How to Reduce Electricity Bill

మీటర్ల ట్యాంపరింగ్ అంటే ఇదేనేమో భయ్యా - ట్రిపుల్​​ బెడ్​రూం ఇంటికి కరెంట్​ బిల్​ రూ.72!