TGPSC Serious on Group 1 Rumors : గ్రూప్ -1 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను టీజీపీఎస్సీ ఖండించింది. ర్యాంకు రాని కొందరు అభ్యర్థులు, కొన్ని కోచింగ్ సెంటర్లు దురుద్దేశపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటనను విడుదల చేశారు. పోటీ పరీక్షల్లో చాలా మందికి ఒకే మార్కులు రావడం సహజమని, టీజీపీఎస్సీ నిర్వహించిన దాదాపు అన్ని నియామక పరీక్షల్లోనూ ఇలా మార్కులు వచ్చాయన్నారు.
గ్రూప్ -1 మెయిన్స్‌లో మొత్తం మార్కులు ఒకే విధంగా వచ్చిన వారికి, పేపర్ల వారీగా వేర్వేరు మార్కులు వచ్చినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. పక్కపక్కన ఉన్నవారికి ఒకే మార్కులు రావడం కూడా సహజమేనని గ్రూప్ -1లో అలా వచ్చిన వారు ఒక శాతం లోపే ఉన్నారని కమిషన్ తెలిపింది. ప్రొటోకాల్స్, నిబంధనల మేరకు యూనివర్సిటీలు, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లోని ఫ్యాకల్టీతో గ్రూప్ -1 మూల్యాంకనం జరిగిందని వివరించింది. గ్రూప్ -1 మెయిన్స్‌లో 18, 19 పరీక్ష కేంద్రాలు వీరనారి చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీలో ఉన్నాయని తెలిపింది.
కోడ్‌ల అయోమయం ఉండకుండా మళ్లీ వేరే హాల్ టికెట్ : అక్కడ మహిళలు, పురుషులకు వేర్వేరు వసతులు లేనందున యూనివర్సిటీ వినతి మేరకు అందులో మహిళ అభ్యర్థులనే వేసినట్లు పేర్కొంది. గ్రూప్ -1 మెయిన్స్ రాసిన మహిళల్లో సుమారు 25 శాతం ఆ పరీక్ష కేంద్రాల్లోనే ఉన్నందున అక్కడ ఎంపికైన వారు కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్నారని టీజీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఎస్టీ కేటగిరీలో టాప్ ర్యాంకు 206 కాదని, ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన యువతికి 12వ ర్యాంకు వచ్చిందని పేర్కొంది. ప్రిలిమ్స్ రాష్ట్రవ్యాప్తంగా జరిగినందున హాల్‌టికెట్లపై జిల్లా, పరీక్ష కోడ్ వేశామని అయితే మెయిన్స్ పరీక్ష కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే జరిగినందున కోడ్‌ల అయోమయం ఉండకుండా మళ్లీ వేరే హాల్‌టికెట్లు ఇచ్చినట్లు కమిషన్ తెలిపింది.
ఇది కేవలం పరిపాలన పరమైన అంశమని టీజీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ -1 మెయిన్స్ ఉర్దూ మీడియంలో కేవలం పది మంది రాశారని, అందులో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన 563 మందిలో ఒకరే ఉన్నారని టీజీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. బొమ్ము పూజిత రెడ్డి అనే అభ్యర్థి తనకు రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని ఫోర్జరీ స్టేట్‌మెంట్‌లో ఫిర్యాదు చేశారని టీజీపీఎస్సీ తెలిపింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని భవిష్యత్తులో టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలన్నింటికీ ఎందుకు డీబార్ చేయకూడదో తెలపాలంటూ నోటీసు ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఆరో పేపర్లో అత్యధిక మార్కులు వంద మాత్రమేనని అంతకు మించి ఎవరికీ రాలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్ తెలిపారు.
రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయని వారి మార్కులు మార్చలేదు : రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయని వారికి మార్కులు మార్చారన్న ఆరోపణలో నిజం లేదని కమిషన్ స్పష్టం చేసింది. అప్లై చేసిన వాటిని మాత్రమే నిబంధనల ప్రకారం రీకౌంటింగ్‌కు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఐఐటీ, యూపీఎస్సీ, నీట్, క్యాట్ వంటి పరీక్షల్లోనూ దిల్లీ, హైదరాబాద్ వంటి సెంటర్ల నుంచే సుమారు 20 నుంచి 30 శాతం ఎంపిక అవుతారని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్ -1 నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ లేదు అందుకే ధ్రువపత్రాల పరిశీలనకు ఒక పోస్టుకు ఒకరు చొప్పున ఎంపిక చేశామని చెప్పారు. అవసరాన్ని బట్టి మిగతా వారిని ప్రతిభ, రిజర్వేషన్ ప్రకారం పిలుస్తామని కార్యదర్శి తెలిపారు.
అలాంటి ఫోన్లు వస్తే టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేయండి : మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని అభ్యర్థులను హెచ్చరించడంతో పాటు టీజీపీఎస్సీలో తమకు తెలిసిన వారు ఉన్నారని ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఫిర్యాదు చేయాలని ఫోన్ నంబర్లు, మెయిల్ ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు తమకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని టీజీపీఎస్సీ తెలిపింది. టీజీపీఎస్సీ అన్ని నియామక పరీక్షలను నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్‌గా నిర్వహిస్తుందని అభ్యర్థులు పుకార్లను నమ్మవద్దని కోరింది.
ఉద్యోగ నియామకాల్లో కీలక సంస్కరణ - ఇక నుంచి 1:1 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి - పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు