AI based Chatbot tells Youth have taken Drugs : యువత మత్తు ముసుగులో చిక్కి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వ్యసనాలకు బానిసై 25 ఏళ్లకే సర్వస్వం కోల్పోతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వినియోగం చాపకింద నీరులా విస్తరించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. యువకుల వికృత చేష్ఠలతో తల్లిదండ్రుల వేదనకు అంతే లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, వీకేఆర్ స్టార్టప్‌లతో కలిసి ఏఐ ఆధారిత యాప్ మిత్ర-టీజీని రూపొందించింది. ఈ యాప్‌తో యువత ప్రాథమిక దశలోనే మాదకద్రవ్యాల బారినపడినప్పుడు గుర్తించడం ఎలాగో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించేందుకు అడుగులు వేస్తోంది.
29 భాషల్లో సమాచారం :
- మిత్ర-టీజీ అనేది ఏఐ ఆధారిత మొబైల్, వెబ్ అప్లికేషన్.
- మాదక ద్రవ్యాల వ్యసనం బారి నుంచి టీనేజర్లను కాపాడే లక్ష్యంతో రూపొందిన యాప్.
- తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ తదితర 29 భాషల్లో అందుబాటులో సమాచారం.
- టీనేజర్లలో తలెత్తే మానసిక, ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకునేలా రూపొందించారు.
- వాట్సాప్‌లో చాట్‌బాట్ మాదిరిగా ఇది పని చేస్తుంది.
- పిల్లల వ్యవహార శైలిని విశ్లేషించేందుకు అవసరమైన సమాచారాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందిస్తుంది.
- ఈ క్రమంలో స్వీకరించే సమాచారం బయటికి పొక్కకుండా గోప్యంగా ఉంచుతుంది.
- ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు టీజీఏఎన్‌బీ ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో హైదరాబాద్‌లో కార్యశాల నిర్వహించింది.
16 పాయింట్లు దాటితే ప్రమాదమే : టీనేజర్లు మాదకద్రవ్యాలు వినియోగిస్తుంటే తల్లిదండ్రులే కనిపెట్టేందుకు 39 అంశాలతో కూడిన ప్రశ్నావళిని యాప్‌లో పోలీసులు అందుబాటులో ఉంచారు. ఇందులో సాధారణ అంశాలనే పొందుపరిచారు. ఒక్కో అంశానికి 0-3 పాయింట్లను కేటాయించగా, ఉపాధ్యాయుల కోసం ఏడు అంశాలను పొందుపరిచారు. వీటికి -3 నుంచి +3 పాయింట్లను కేటాయించారు. ఎవరైనా టీనేజర్‌కు సంబంధించి మొత్తం పాయింట్లు 16 దాటితే అతడు ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లు అనుమానించి, మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడినట్లు గుర్తించి తదుపరి వైద్య పరమైన చికిత్స చేయించడంపై ప్రధాన దృష్టిని సారించాలి.
భాష ఎంచుకున్నాక సంభాషణ :
- ఈ యాప్ లింక్ https://wa.me/918712661731?test=TELG2024
- వాట్సప్‌లో యాప్ తెరుచుకుంటుంది.
- తొలుత భాషను ఎంచుకున్న అనంతరం సంభాషణ కొనసాగించాలి.
ప్రశ్నావళిలోని కొన్ని అంశాలు :
- పిల్లాడు సాధారణం కంటే ఎక్కువగా మగతగా ఉంటున్నాడా?
- మీ పిల్లాడిలో ఈ మధ్య మానసిక కల్లోలం పెరిగిందా?
- ఒంటరిగా ఉండేందుకేమైనా ప్రాధాన్యమిస్తున్నాడా?
- మునుపటికంటే ఇప్పుడు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నాడా?
- మాటల్లో తడబాటు కనిపిస్తోందా?
- అతని ఆకలి అకస్మాత్తుగా పెరిగిందా?
- తరచూ భోజనం మానేస్తున్నాడా?
- అతని కాళ్లు, చేతుల్లో వణుకును గమనించారా?
సైబర్, డ్రగ్స్ దందాలో పావులుగా మహిళలు - నేరవలయంలో చిక్కి ఆగమవుతున్న జీవితాలు
విమానాల్లోనే హైదరాబాద్, ముంబయి లాంటి నగరాలకు డ్రగ్స్ సరఫరా - డ్రగ్స్ దందాలో విస్తుపోయే విషయాలు