ETV Bharat / state

జల వివాదాలపై చర్చకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ! - ఏర్పాట్లు చేసిన కేంద్ర జలశక్తి శాఖ

కృష్ణా, గోదావరిలో వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడికి సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయం - సీఎం సూచనలతో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు ఉత్తమ్ లేఖ - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి కేంద్రం ఏర్పాట్లు

UTTAM KUMAR REDDY
Meeting of Chief Ministers Telugu States (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : July 14, 2025 at 7:11 PM IST

|

Updated : July 14, 2025 at 7:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Meeting of Chief Ministers of Telugu States : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశానికి ఆహ్వానం పంపింది. ఈనెల 16న మధ్యాహ్నం రెండున్నర గంటలకు దిల్లీలోని శ్రాంశక్తిభవన్‌ వేదికగా నిర్వహించనున్న సమావేశానికి వచ్చేందుకు వీలవుతుందో? లేదో తెలపాలని సీఎంలను కోరింది.

వీలవుతుందో లేదో చెప్పండి : ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు, ఎల్లుండి దిల్లీలో పర్యటించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 16,17 తేదీల్లో దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇద్దరు సీఎంలు 16వ తేదీన దిల్లీలోనే ఉండనున్న నేపథ్యంలో సమావేశానికి రావడానికి వీలయ్యేదీ, లేనిదీ తెలియజేయాలని కేంద్ర జలశక్తి శాఖ సమాచారం పంపింది. చర్చించాల్సిన అంశాల అజెండా వివరాలను ముందుగానే తమకు అందించాలని సూచించింది.

కృష్ణా, గోదావరి జలాల విషయంలో : కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇప్పటి వరకు జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించేలా కార్యచరణ చేపట్టాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మంత్రి ఉత్తమ్​ లేఖ : ఎల్లుండి దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశంలో రాష్ట్ర నీటి వాటాల సాధన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులతో పాటు కొత్త ప్రాజెక్టుల కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు. సీఎం సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల వనరులశాఖ మంత్రి సీఆర్ పాటిల్​కు లేఖ రాశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులతో పాటు కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌లలోని పలు సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో కోరారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. పాలమూరుకు మైనర్ ఇరిగేషన్ కంపోనెంట్ నుంచి సేవింగ్స్ 45 టీఎంసీలు, గోదావరి నీటిని కృష్ణా నదికి బదిలీ చేయడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన 45 టీఏంసీలు ఈ ప్రాజెక్టు వినియోగించుకోవాలని ప్రతిపాదించిందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి జలాల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం 45 టీఎంసీల కృష్ణా నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్​పైన వాడుకునే వీలుందని ఆ నీటినే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిందని వివరించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జల సంఘం ఆమోదించాలని ఆ తర్వాత పర్యావరణ అనుమతులకు సిఫార్సు చేయాలని కోరారు.

ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోంది : ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వల్ల కరువు ప్రాంతాల రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వస్తే కేంద్రం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సాయంతో పాటు నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు పొందవచ్చన్నారు. కృష్ణా బేసిన్‌లో నీటిని శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు నీటిని ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా మళ్లిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 880 అడుగుల వద్ద లక్షన్నర క్యూసెక్కుల కంటే ఎక్కువ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లిస్తోందని తెలిపారు. ఏకంగా 841 అడుగుల నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని మళ్లించేలా కాల్వల నిర్మాణాలను ఏపీ చేపట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందే కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో 287.06 టీఎంసీల సామర్థ్యంతో వివిధ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

మీరు మీరు తేల్చుకోండి - నీటి పంపకాలపై కేఆర్‌ఎంబీ స్పష్టం

కేఆర్‌ఎంబీ సమావేశానికి ఏపీ అధికారులు ఆబ్సెంట్ - తెలంగాణ అధికారులు అసంతృప్తి

Last Updated : July 14, 2025 at 7:33 PM IST