Paramparagat Krishi Vikas Yojana : దేశంలో వ్యవసాయ యాంత్రీకరణతో ఖర్చు, శ్రమ తగ్గిందని సంతోషిస్తుండగానే మరోవైపు వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం విచక్షణారహితంగా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలోకి వచ్చినప్పటికీ రసాయనాలు వాడకం మాత్రం తగ్గడం లేదు. ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో చాలా మంది రైతులు విష రసాయనాలు విచ్చలవిడిగా వాడడంతో తీరు పర్యావరణానికి విఘాతం కలిగిస్తోంది. రసాయన అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులు తిని ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద చేయూత అందిస్తుండగా దీన్ని తెలుగు రాష్ట్రాలు క్రమంగా అందిపుచ్చుకుంటున్నాయి.
దెబ్బతింటోన్న ప్రజల ఆరోగ్యం : దేశంలో హరిత విప్లవం నేపథ్యంలో వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది. పంట దిగుబడులు గణనీయంగా పెరిగి ఆహార ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించింది భారత్. అదే సమయంలో సాగులో రసాయనాల వినియోగం కూడా పెరిగింది. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు మందులు వినియోగిస్తూ ఉండటంతో భూమి శక్తి కోల్పోయి నిర్జీవంగా తయారవుతోంది. ఇలా పండించిన రసాయన అవశేషాలతో కూడి పంటలు, ఆహారం తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. పంటల్లోంచి ఒంట్లోకి రసాయనాలు వచ్చేసి మానవాళి ఆరోగ్యాలను కబళించేస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో పర్యావరణం, భూమి ఆరోగ్యం, నీరు కలుషితమవుతుండటంతోపాటు పొలాల్లో భాస్వరం నిల్వలు భారీగా పేరుకుపోయినట్లు అనేక అధ్యయనాలు, నివేదికలు వెల్లడిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద చేయూత కేంద్రం సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తుండగా క్రమంగా సత్ఫలితాలు వస్తున్నాయి.
పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావాలంటే నేలకు సూక్ష్మ, స్థూల పోషకాలు అవసరం. గతంలో సేంద్రియ ఎరువుల ద్వారా అవి సమపాళ్లలో అందేవి. 60వ దశకంలో విజయవంతమైన హరిత విప్లవం అనంతరం అధిక దిగుబడి ఇచ్చే పంట వంగడాలకు తోడు సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, నిషేధిత గ్లైఫోసేట్ కలుపు మందుల వాడకం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఆహారోత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబన సాధించింది. కానీ, కాలక్రమంలో రసాయనాల ఉధృతి మరీ కట్టుతప్పింది.
పెను ప్రమాదంలో పడతాయి : ప్రమాదకర రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2023-24 సంవత్సరం దేశవ్యాప్తంగా 64.84 మిలియన్ మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు పొలాల్లో గుమ్మరించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 1.6 శాతం ఎక్కువ. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సగటుకు రెట్టింపు స్థాయిలో రసాయన ఎరువులు వాడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కొన్ని జిల్లాల్లో అది ఏకంగా 4 నుంచి 6 రెట్లకు పైన ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణాలో సైతం ఇదే దుస్థితి నెలకొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగు భూములు నిస్సారమై భారతీయ ఆహార, పౌష్టిక భద్రత, ప్రజాసంక్షేమం పెను ప్రమాదంలో పడతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తోన్నారు.
దేశంలో చాలా రాష్ట్రాల్లో అధిక ఫల సాయం ఆశిస్తూ సాగుదారులు అశాస్త్రీయంగా తమ పొలాల్లో రసాయన ఎరువులు విపరీతంగా వెదజల్లుతున్నారు. దాంతో చేలల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తెగుళ్లు, చీడపీడల బెడద ఎక్కువై పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్థిక భారం అధికమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కీలక సేంద్రీయ కర్బనం దెబ్బతిని పంటల భూములు సార హీనమవుతున్నాయి. ఆయా పంట ఉత్పత్తుల ద్వారా మానవ దేహంలోకి చేరుతున్న రసాయన అవశేషాలు ఏకంగా ప్రాణాంతక క్యాన్సర్లు, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అదే సమయంలో జవనశైలి వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ ప్రబలడం ఇందుకు ఉదాహరణ.
నేల సారం కోల్పోయి : దేశీయంగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం - ఎన్‌పీకే వినియోగ నిష్పత్తి 4.2.1కు మించకూడదు. కానీ, గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఆది 9.8.3.7.1గా నమోదైంది. గుంటూరు, తిరుపతి, బాపట్ల వంటి జిల్లాల్లో ఆ మోతాదు మరింతగా దాటిపోవడం కలవరపరుస్తోంది. పంజాబ్ తరవాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనే పొలాల్లో రసాయన ఎరువుల గుమ్మరింత ఎక్కువగా ఉందని, అది తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. క్షేత్రస్థాయిలో భూసార పరీక్షలను పట్టించుకోకుండా చాలా చోట్ల అవసరం లేకపోయినా యూరియా, ఇతర రసాయన ఎరువులను పొలాల్లో చల్లేస్తున్నారు. ఫలితంగా నేల సారం కోల్పోయి పంటల నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత విపరీతంగా పడిపోతోంది.
రూ50 వేలు ప్రోత్సాహకం : దేశంలో సాగులో రసాయనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో క్లస్టర్ విధానంలో రైడా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సేంద్రీయ సేద్యానికి ప్రాధాన్యత ఇస్తూ రాయితీలు, ఇతర ఉపకరణాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి చేయూత ఇస్తోంది. పీకేవీవై పథకం కింద 50 ఎకరాల విస్తీర్ణానికి ఒకటి చొప్పున క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకురాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతోంది. ఒక్కో రైతుకు ఒక హెక్టారుకు మూడేళ్లల్లో ప్రోత్సహకంగా 50 వేల రూపాయలు అందిస్తోంది. విష రసాయనాల అధిక వినియోగం తగ్గించి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువుల వాడకం ప్రోత్సహించడం పీకేవీవై పథకం లక్ష్యం.
తెలంగాణలో 50 ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2 వేల క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆర్గానిక్ మార్కెట్ కోసం కూడా 1500 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పీకేవీవై పథకం కింద అత్యధికంగా 5.09 లక్షల ఎకరాల్లో 2.65 లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి నిరుడు కేంద్రం 317.21 కోట్ల రూపాయలు అందించింది. దేశంలో ఈ నిధులు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు : పొలాల్లో రసాయనాల వినియోగం ఆందోళన కల్గిస్తున్నా అదే సమయంలో భూమికి, ఇటు ప్రజల ఆరోగ్యానికి పంట పండించే రైతుకు మేలుచేసే ప్రకృతి, సేంద్రీయ విధానం తిరిగి ప్రాచుర్యంలోకి రావడం హర్షనీయం అని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఈ పద్ధతిలో ఒనగూరుతున్న ప్రయోజనాలు గుర్తించి తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం శుభసూచకమే. సహజ వ్యవసాయ విధానం మరింత విస్తృతమై ఎక్కువ మంది రైతులు ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం చేసేలా ప్రజలు సేంద్రీయ ఆహార పంటలు వినియోగించేలా ముందుకొస్తే ఉత్తమం. అది నెరవేరాలంటే, స్థానిక పరిస్థితులకు తగిన వ్యవసాయ విధానాలకు పెద్దపీట వేయాలి. సేంద్రియ సాగుకు రాష్ట్రాలూ వెన్నుదన్నుగా నిలవాలి. ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువుల వాడకం మూలంగా తలెత్తే ఉపద్రవాలపై రైతులకు అవగాహన కల్పించాలి. భూసార పరీక్షల ఫలితాల ప్రకారమే ఎరువులను వాడేవిధంగా చైతన్యం పెంచాలి. అప్పుడే రైతుకు లాభం, దేశానికీ క్షేమం.
100 శాతం సబ్సిడీతో రూ.50 వేలు - 90 శాతం సబ్సిడీతో రూ.లక్ష ప్రభుత్వ లోన్
రైతులకు గుడ్న్యూస్- 2 బీమా పథకాలను పొడిగించిన కేంద్రం- వాటితో ఫుల్ బెనిఫిట్స్!