తెలంగాణలో టూరిస్ట్ పోలీసులు - పర్యాటక ప్రాంతాల్లో ఇక ఫుల్ సేఫ్టీ
టూరిస్టు పోలీసులు - హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న 80 మంది - ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎక్కువ మంది టూరిస్టు పోలీసులు కావాలి!

Published : October 14, 2025 at 11:54 AM IST
Tourism Police Protect to Tourists : మనకు కేవలం సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపక శాఖ, ఎస్పీఎఫ్ పోలీసులు మాత్రమే తెలుసు. కానీ టూరిస్టు పోలీసింగ్ గురించి మీకు తెలుసా? పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాల్లో ప్రజలకు సహకరించేందుకు, రక్షణ కల్పించేందుకు వీళ్లు ఉన్నారని మీకు తెలుసా? అయితే ఆ ప్రాంతాల్లో ఎక్కడా కనిపించడం లేదని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ టూరిస్టు పోలీసింగ్ విధానాన్ని తీసుకువచ్చింది.
పోలీసు శాఖలో శిక్షణ పొంది ఉద్యోగం చేస్తున్న కొందరికి పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి సందర్శన ప్రదేశాల్లో గైడ్స్‌గా నియమిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అక్కడ కొంతమంది సిబ్బందికి శిక్షణ ఇవ్వగా, సోమవారం వారంతా విధులకు హాజరయ్యారు. ఈ పోలీసింగ్ వల్ల పర్యాటకులు, భక్తులకు ఎంతో మేలు జరగనుంది. ఆ ప్రాంతాల నుంచి ముందుగానే తెలుసుకోవడానికి వీలుంటుంది. అలాగే వాటి చరిత్రను కూలంకుశంగా తెలుసుకొని, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ టూరిస్టు పోలీసులు చూసుకుంటారు.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో పని చేస్తున్న సుమారు 20-30 మంది కానిస్టేబుల్స్‌కు టూరిస్టు గైడ్ కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎంపికైన వారికి హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
ఎంపిక విధానం ఇలా : ప్రస్తుతం పోలీసుశాఖలో ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన వారు, మేనేజ్మెంట్ చేసిన వారు ఉద్యోగాల్లోకి వస్తున్నారు. వీరిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలపై పట్టున్న వారిని గుర్తించి వారిని ఎంపిక చేస్తున్నారు. అనంతరం టూరిజం విభాగం ఆధ్వర్యంలో పలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల గురించి వారికి వివరిస్తారు. ఇలా ఉమ్మడి వరంగల్‌లో రామప్ప, లక్నవరం, వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, బొగత జలపాతం, ఇలా మరెన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ గైడ్స్ కూడా లేరు. అతి త్వరలో ఎంపిక చేసిన కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఇచ్చి నియమించుకోనున్నారు. ఈ విధానం ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నా, అంచెలంచెలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
80 మందికి శిక్షణ : సందర్శకుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం 80 మందికి శిక్షణ ఇచ్చింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు 27న హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో టూరిస్టు పోలీసుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎంపిక చేసిన 80 మంది పోలీసులకు హైదరాబాద్ నిథమ్‌లో అక్టోబరు 6-9 వరకు టూరిస్టు పోలీసుల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
10, 11 తేదీల్లో యాదగిరిగుట్ట, గోల్కొండ కోట, భువనగిరి, లుంబినీ పార్కు, కుతుబ్షాహి సమాధులకు ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న టూరిస్టు పోలీసులను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో నియమించారు. హైదరాబాద్‌లో నిత్యం వేల సంఖ్యలో దేశీయ, విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లలేని పరిస్థితి ఉంది. అక్కడ ఆకతాయిలు వారిని వేధింపులకు గురి చేస్తున్న ఉదంతాలు చూశాం. అలాంటి ప్రాంతాల్లో ఈ టూరిస్టు పోలీసింగ్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడనుంది.
రామోజీ ఫిల్మ్‌సిటీలో గ్లోబల్ టూరిజం విలేజ్, నైట్ సఫారీ! - రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
టూరిస్ట్ డెస్టినేషన్లుగా పల్లెటూళ్లు - అగ్రి టూరిజంతో కాలుష్యానికి దూరంగా ప్రశాంత జీవనం

