Govt using AI In indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఇందిరమ్మ యాప్‌లో తప్పుడు సమాచారం ఎంటర్ చేస్తే ఇట్టే పట్టేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో భాగంగా 562 గ్రామాల పరిధిలో 70,122 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 46,432 ఇళ్లకు మంజూరు పత్రాలను అందించారు. 17,000 మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 4,500 ఇళ్లకు సంబంధించి పునాది వరకు పనులు పూర్తయినట్లుగా ఆన్‌లైన్‌లో ఎంటర్ చేశారు. బేస్మెంట్ పూర్తయితే ప్రభుత్వం మొదటి దశలో భాగంగా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో రూ.లక్ష జమ చేస్తుంది.
కృత్రిమ మేధతో అక్రమాలకు అడ్డుకట్ట : మొదటి దశ బిల్లుల మంజూరులో భాగంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వివరాలను అధికారులు కృత్రిమ మేధ సాంకేతికతతో జల్లెడ పడుతున్నారు. ఇందిరమ్మ యాప్‌లో గుంతలు, పునాది, పిల్లర్లు, స్లాబు, గోడలు, ఇంటి స్వరూపం తదితర ఫొటోలను ముందే నమోదు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు సంబంధించిన 360 డిగ్రీల సమాచారమూ నిక్షిప్తమై ఉంటుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడి వివరాలు, పనుల పరిస్థితిపై యాప్‌లో వివరాలు ఎంటర్ కాగానే ఏఐ వాటిని పరిశీలిస్తుంది. ఉండాల్సిన దానికన్నా భిన్నంగా కనిపిస్తే వెంటనే ఏఐ సాంకేతికత గుర్తిస్తుంది. దీని ఆధారంగా అధికారులు మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరుపుతారు. ఇందులో అక్రమాలు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు.
తప్పుడు ఫొటోల అప్‌లోడ్ - బిల్ కలెక్టర్‌పై వేటు : ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో 18 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పునాదులు పూర్తయ్యాయంటూ బిల్లుల కోసం ఆన్‌లైన్‌లో వివరాలు, ఫొటోలు అప్‌లోడ్ చేశారు. అయితే యాప్‌లో పొందుపర్చిన నమూనాలతో పోలిస్తే వివరాల్లో తేడా ఉన్నట్లుగా ఏఐ సాంకేతికత పేర్కొనడంతో అధికారులకు సందేహం కలిగింది. క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆ ఇళ్ల పునాది నిర్మాణాలు పూర్తి కాలేదని వెల్లడైంది. దీంతో ఆన్‌లైన్‌లో తప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేసిన సంబంధిత బిల్ కలెక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులోనూ అక్రమాలకు తావులేకుండా కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించుకోనున్నారు. ఇప్పటికే 360 డిగ్రీల సమాచారంతో దరఖాస్తుదారుల వివరాలను యాప్‌లో నమోదు చేశారు. దరఖాస్తుదారుల్లో అనర్హులున్నట్లయితే ఏఐ గుర్తిస్తుంది. క్షేత్రస్థాయిలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సిబ్బంది, అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.
యాప్‌లో ఏఐ సాంకేతికతతో గుర్తించేవి
- లబ్ధిదారుల ముఖ కవళికలు
- ఇంటి స్వరూపం- ఆర్‌సీసీ/ ఏసీ షీట్/తాటాకులు/ ప్లాస్టిక్ షీట్ రూఫ్
- ఇళ్లు నిర్మించాల్సిన స్థలం అక్షాంశ, రేఖాంశాలు(లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్)
- ఇళ్ల నిర్మాణ దశలకు సంబంధించిన ఫొటోలు
- లబ్ధిదారుడి బ్యాంకు అకౌంట్ వివరాలు