TGSRTC Bus Pass Charges Increases : రాష్ట్ర వ్యాప్తంగా బస్ పాస్ ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ 20శాతం నుంచి 24శాతం వరకు పెంచింది. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ధరను రూ.1,600కు పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్‌ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది. కొత్త ఛార్జీలు నేటి నుంచి అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.
మూడేళ్లుగా విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచలేదని, బస్సుల నిర్వహణ, డీజీల్ ధరలు పెరగడం, ఉద్యోగుల జీతాల చెల్లింపు వంటి వాటితో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. వాటి నుంచి బయటపడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని బస్ పాస్ ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

అదేసమయంలో బస్సు పాస్ ఛార్జీలతో పాటు టోల్‌ప్లాజా యూజర్ ఛార్జీని ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.10 చొప్పున వసూలు చేస్తామంది. టోల్‌ప్లాజా రూట్‌లో వెళితేనే యూజర్ ఛార్జీ ఉంటుందని, ఆ మార్గంలో వెళ్లని బస్సులకు ఇది వర్తించదని స్పష్టంచేసింది. పెంచిన బస్ పాస్ ఛార్జీలతో ప్రతి నెల ఆర్టీసీకి సుమారు కోటి రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల టోల్ ఛార్జీలు పెరగడంతో ఆ భారం ఆర్టీసీపై పడుతుందని తెలుపుతూ అందుకే టోల్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని యాజమాన్యం స్పష్టం చేసింది.
హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లో సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని దీన్ని తగ్గించడానికి ఇకపై ఆర్డినరీతో పాటు హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలోనూ పాస్ ఉన్న విద్యార్థులను అనుమతిస్తామని పేర్కొంది. దశాబ్దాలుగా ప్రయాణికులు, విద్యార్థులు ఆర్టీసీని ఎంతగానో ఆదరిస్తున్నారని తెలిపారు. అలాగే ఇప్పుడు పెంచిన ఛార్జీల పెంపును కూడా స్వాగతించాలని ఆర్టీసీ కోరింది.
పెంచిన బస్‌పాస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి : పెంచిన బస్‌పాస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన చేశారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో పెద్దఎత్తున బస్‌పాస్ ఛార్జీలు పెంచడం ప్రభుత్వానికి, ఆర్టీసీకి తగదని ఆయన అందులో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మహాలక్ష్మి పేరుతో ఉచిత పాస్ ప్రయాణం అంటూనే, మరోవైపు ఛార్జీలు పెంచిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
సమ్మర్ దెబ్బకు కిక్కిరిసి నడుస్తున్న ఆర్టీసీ బస్సులు - కొత్తవి కావాలని వినతులు