'ఇందిరమ్మ ఇళ్లు మాకొద్దు' - సొంతింటి కలపై లబ్ధిదారుల్లో అనాసక్తి
ఆశించిన స్థాయిలో జరగని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు - తమకు ఇందిరమ్మ ఇళ్లు వద్దని రాసిస్తున్న ప్రజలు - గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన నిబంధనలే అనాసక్తికి కారణమని వెల్లడి

Published : October 14, 2025 at 2:06 PM IST
Indiramma Houses Scheme in Telangana : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సర్కారు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇళ్లు మంజూరైన వారిలో కొంతమంది పనులు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 2300 మంది లబ్ధిదారులు తమకు ఇందిరమ్మ ఇళ్లు వద్దని రాసివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది నిరుపేదలు, సొంతిల్లు లేనివారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ఎందుకు అనాసక్తి చూపుతున్నారనే కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
నోటీసులు జారీ చేసిన అధికారులు : నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతో పాటు సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలంలో మొత్తం 17,247 ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. 13,541 ఇళ్లకు ప్రొసీడింగ్స్ కాపీలు ఇవ్వగా, 10,038 మంది పనులు ప్రారంభించారు. ప్రొసీడింగ్ పొందిన వారిలో 3,503 మంది ఇప్పటివరకు పనులు చేపట్టలేదు. వీరిలో 45 రోజులు గడువు ముగిసిన వారు కూడా ఉన్నారు. దీంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇంటిని రద్దు చేయండి : నోటీసులకు వారి నుంచి సమాధానాలు రాకపోవడంతో అధికారులు వారి వద్దకు వెళ్లి పరిశీలన చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో వారు తమకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను ఏకంగా రద్దు చేయాలని పత్రం రాసిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు జిల్లాలో 2300 మంది ఇందిరమ్మ ఇళ్లు వద్దని పత్రాలు రాసిచ్చినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. ఇలా రద్దు చేసుకున్న వారి స్థానంలో త్వరలో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.
ఇవీ కారణాలు!
- రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన నిబంధనలే ప్రజల అనాసక్తికి కారణం.
- ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ) దాటకూడదు. హాల్, కిచెన్, బెడ్‌రూం తప్పనిసరి ఉండాలని నిబంధన.
- కొందరు పేదలకు ఇంటి నిర్మాణం పనులు వేగంగా చేపట్టేందుకు చేతిలో డబ్బు లేకపోవడం.
- కొంతమంది వయోభారం కలిగి ఉండటంతో ఇప్పుడెందుకు అన్నట్లుగా ఆసక్తి చూపడం లేదు.
- స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల మంజూరుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించకపోవడం.
నిర్మాణం చేపట్టని వారికి తాఖీదులు : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతిని పెంచడానికి సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభమై పది నెలలు కావొస్తుంది. అయినా పురోగతి కనిపించడం లేదు. దీంతో పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు ఇళ్ల నిర్మాణం చేపట్టని వారికి తాఖీదులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
కార్యదర్శులతో నోటీసులు : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ఇప్పటివరకు చాలా మంది ముగ్గు కూడా పోయలేదు. వారందరి సమస్యలు తెలుసుకుని ఇళ్ల పనులను ప్రారంభించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఇప్పటికీ పనులు మొదలుపెట్టని లబ్ధిదారులకు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా నిర్మాణాలు ప్రారంభించాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఇంటి నిర్మాణానికి సుముఖంగా లేము అని రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని వారిని కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో ఇక్కట్లు : ముగ్గు పోయరు - 'నాట్ విల్లింగ్' రాసివ్వరు

