Telangana HC Refused to Grant Bail to Alprazolam Accused : నేర తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో సాధారణంగా కోర్టులు బెయిల్ మంజూరు చేయడానికి మొగ్గుచూపవని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేగాకుండా బెయిల్ పిటిషన్లపై విచారణలో సాక్ష్యాలు, ఆధారాల పూర్వాపరాల్లోకి వెళ్లలేమని, వీటిని అప్పీలుపై తుది విచారణ సందర్భంగానే కోర్టులు పరిశీలిస్తాయని స్పష్టం చేసింది. ఎన్డీపీఎస్ చట్ట పరిమితికి మించి నిషేధిత పదార్థం, అల్ఫాజోలం కేసులో పదేళ్ల శిక్ష ఎదుర్కొంటున్న నిందితులకు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
నిషేధిత అల్ఫాజోలం తయారీలో పదేళ్ల శిక్షను ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన బండారు హనుమంతరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాసంశెట్టి నరేష్‌లకు హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మెదక్ జిల్లా జిన్నారంలోని వెంకట రాఘవ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 2016లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించి 132 కిలోల అల్ఫాజోలంతో పాటు తయారీ యంత్రాలు, పరికరాలు, ముడిపదార్థాలు, రసాయనాలు సీజ్ చేశారు. ఇందులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధిస్తూ 2022లో కింది కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హనుమంతరెడ్డి, వాసంశెట్టి నరేష్‌లు అప్పీలు దాఖలు చేశారు. ఇదే కేసులో వీరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా డీఆర్ఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
సుప్రీం కోర్టు బెయిల్‌పై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టాలని, నిందితులు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అప్పీలులో శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, విచారణలో జాప్యం జరుగుతున్న కారణంగా బెయిల్ మంజూరు చేయాలంటూ హనుమంత రెడ్డి, నరేష్‌లు ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు.
కోర్టు సంతృప్తి చెందితేనే శిక్ష పడిన కేసుల్లో బెయిల్ : స్వాధీనం చేసుకున్న అల్ఫాజోలం పరిమితికి మించి నిందితుల వద్ద లభించిందని, 132 కిలోల నిషేదిత పదార్థం కలిగి ఉన్నారని, నేర తీవ్రత ఎక్కువగా ఉన్న ఇలాంటి కేసుల్లో కోర్టులు సాధారణంగా బెయిలు మంజూరు చేయడానికి మొగ్గుచూపరని పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ చట్టప్రకారం నిందితుడు తప్పుచేయలేదని గానీ, బెయిలుపై ఉన్నపుడు మరో నేరం చేసే అవకాశం లేదని కోర్టు సంతృప్తి చెందితేనే శిక్ష పడిన కేసుల్లో బెయిలు మంజూరు చేస్తుందన్నారు.
అంతేగాకుండా నిందితుల తరపు న్యాయవాదులు లేవనెత్తుతున్న సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాల పూర్వాపరాలు బెయిలు పిటిషన్ల విచారణలో లేవన్నారు. వీటిని అప్పీలు సమయంలోనే తేల్చుకోవాల్సి ఉందని తెలిపారు. 23 నెలలుగా జైలులో ఉన్నాడన్న కారణంగా బెయిలు మంజూరు చేయలేమన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ - తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసు - భుజంగరావు, రాధాకిషన్‌రావుకు హైకోర్టు బెయిల్